Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మత ప్రచార మార్పిడి అభూత కల్పనే...మంత్రి అంజాద్ బాషా

మత ప్రచార మార్పిడి అభూత కల్పనే...మంత్రి అంజాద్ బాషా
, గురువారం, 21 నవంబరు 2019 (08:48 IST)
మత ప్రచార మార్పిడికి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా ఖండించారు. వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో ఉపముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.

గడిచిన 5 నెలల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విధానంపై 90 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్న అంశాన్ని మంత్రి అంజాద్ బాషా గుర్తుచేశారు.

గత ఎన్నికలకు ముందు నవరత్నాల పేరుతో రెండు పేజీల మేనిఫెస్టో ద్వారా తయారుచేసిన హామీలను నెరవేర్చిన ఘనత ప్రభుత్వానికి దక్కిందన్నారు.  తమ ప్రభుత్వానికి మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథాలుగా భావిస్తున్నట్లు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అంశాన్ని మంత్రి గుర్తుచేశారు.

తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెట్టడాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు. అనతికాలంలోనే వాలంటీర్లు, గ్రామ సచివాలయ  వ్యవస్థ ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు.

వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా ఆటో కార్మికులకు రూ.10 వేల ఆర్థిక సహాయం, వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు గత ప్రభుత్వం కేటాయించిన రూ.4వేలను తమ ప్రభుత్వం 10 వేలకు పెంచామన్న విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా  రైతు భరోసాను ఒక ఏడాది ముందే అమలు చేయడంతో పాటు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రూ.12,500 ను 13,500కు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.

అలాగే అమ్మఒడి  పథకం ద్వారా 45 లక్షల మంది తల్లుల ఖాతాలకు నేరుగా జనవరి నెలలో రూ.15 వేల రూపాయలను జమ చేయడం జరుగుతుందన్నారు. హజ్, జెరూసలెం యాత్రలకు  వెళ్లే వారి వార్షిక ఆదాయలను పరిగణలోకి తీసుకొని రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి రూ.40 వేల నుండి రూ.60 వేలు, రూ.3 లక్షల పైబడి ఆదాయం ఉన్న వారికి రూ.20 వేల నుండి రూ.30 వేలు ఆర్థికసాయం పెంచుతూ రెండు రోజుల క్రితం రెండు  జీవోలు విడుదల చేశామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించే చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలోనే బుధవారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు 60 వేల ఎకరాలుండగా అందులో 29 వేల ఎకరాలు వివాదాస్పదం, ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించామన్నారు.

వీటిపై ఇప్పటికే కొన్ని కోర్టు కేసులు నడుస్తున్నాయని సమస్యల పరిష్కారానికి ముగ్గురు సీనియర్ న్యాయవాదుల కమిటీని ఏర్పాటు చేయబోతున్నామన్నారు.తద్వారా త్వరితగతిన వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకొని ముస్లీం, మైనార్టీల సంక్షేమానికి వినియోగిస్తామన్నారు.

వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కడపలో ఆక్రమణకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకొని కంచె వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

విశాఖపట్టణంలోని దేవాడ ప్రాంతంలో సుమారు 27 గ్రామాల ప్రజలు 5 వేల ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు వంశపారపర్యంగా ఆక్రమించుకొని నివాస ప్రాంతాలుగా, వ్యాపార కేంద్రాలుగా, వ్యవసాయ భూములగా సాగుచేసుకుంటున్నారు. ఈ సమస్యను అక్కడి ముస్లింలు తమ దృష్టికి తీసుకువచ్చారని సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.

ఉర్ధూ అకాడమీలో అక్రమాలపై విజిలెన్స్ కమిటీ విచారణ చేపట్టిందని, అందులో అవినీతి జరిగిందని వెల్లడికాగా సంబంధిత సూపరింటెండెంట్ ను విధులనుంచి తొలగించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన మౌలానా అబ్దుల్ కలాం జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి మదర్సా విద్యకు సంబంధించి పలువురు ముస్లింలు విన్నవించగా స్పందించినట్లు ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు.

మదర్సా విద్యకు సంబంధించి ఎలాంటి ఉపాధి అవకాశాలు రాష్ట్రంలో లేనందున ఇతర రాష్ట్రాల్లో మదర్సాలు కొనసాగుతున్న తీరును పరిశీలించి రాష్ట్రంలో ప్రత్యేక మదర్సా బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తద్వారా మదర్సా విద్యలో ఖురాన్, ఉర్దూ భాషతో పాటు ఆధునిక విద్యను అమలు చేసేలా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు.

ఇప్పటికే మదర్సాలో విద్యనభ్యసిస్తున్న ముస్లిం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్న అమలు చేస్తున్నామన్నారు. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా మదర్సాలో చదివే విద్యార్థుల తల్లి ఖాతాల్లో రూ.15 వేలు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

కొన్ని రోజులుగా ఇసుక విషయంలో రాద్దాంతం చేసిన ప్రతిపక్షాలకు రోజుకు రెండున్నర లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు అందించడంతో విమర్శించడానికి ఏ విషయం దొరక్క ఆంగ్ల మాధ్యమంపై దుష్ప్రచారానికి తెరలేపాయని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు.

అదే విధంగా  రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడానికి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు..తమ ప్రభుత్వానికి అన్ని కులాలు, మతాలు, వర్గాలు సమానమేనన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రతిపక్షాలు స్వార్థ ప్రయోజనం విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.

హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని మీడియా ప్రతినిధి ప్రస్తావించగా ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా శాసనాలను  అనుసరించి నడుచుకొంటుందని వివరణిచ్చారు. పారదర్శక పాలన అందించడం కోసమే ప్రభుత్వం మార్పులను అనుసరిస్తుందన్నారు.

ఇటీవల జరిగిన సీఎస్ బదిలీ అంశంలో పరిపాలన సౌలభ్యం కోసం జరుగుతున్న బదిలీలు తప్ప ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మో... ఆర్థిక శాఖ... బెంబేలెత్తుతున్న బుగ్గన