అమరావతి యువతకు ఉపాధి... ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు
నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలలోని 25 రెవెన్యూ గ్రామాలు రాజధాని పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ గ్రామాలలోని భూములను రైతులు స్వచ్ఛందం
నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలలోని 25 రెవెన్యూ గ్రామాలు రాజధాని పరిధిలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ గ్రామాలలోని భూములను రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణానికి ఇవ్వడంతో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవించే వారి విషయంలో ప్రభుత్వం అనేక సహాయ చర్యలు చేపట్టింది. సామాజిక భద్రతకు అనేక పథకాలు అములు చేస్తోంది.
భూములు లేని వారికి ఒక్కో కుటుంబానికి నెలకు రూ.2500 చొప్పున పెన్షన్ ఇస్తోంది. ఈ విధంగా పది సంవత్సరాలు చెల్లిస్తారు. అలాగే ఈ గ్రామాలలోని యువతకు ప్రభుత్వమే ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేసింది. ఈ ప్రాంతంలోని యువతీయువకులకు వారి విద్యార్హతలు ఆధారంగా, వారికి ఇష్టం ఉన్న రంగాలలో ప్రభుత్వం నైపుణ్య శిక్షణ ఇప్పించింది. సీఆర్డీఏ ఆధ్వర్యంలో అమరావతి నైపుణ్యభివృద్ధి సంస్థ(ఏఎస్ డీఐ)ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా యువతకు వివిధ ప్రముఖ సంస్థలలో శిక్షణ ఇప్పించారు. రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాలలోనూ, స్థానికంగా సీఆర్ డీఏ అధికారుల సహాయసహకారాలతో వారు వివిధ సంస్థలలో ఉద్యోగాలు పొందారు. ఇంకా పొందుతూనే ఉన్నారు.
సీఆర్ డీఏ డ్యాష్ బోర్డులో పొందుపరిచన ప్రకారం ఇప్పటి వరకు ఏఎస్ డీఐ ఆధ్వర్యంలో వివిధ సంస్థలలో 483 మందికి శిక్షణ ఇప్పించారు. వారిలో 386 మందికి ఉద్యోగాలు లభించాయి. ఎటువంటి శిక్షణ పొందకుండా 225 మంది నేరుగా ఉద్యోగాలలో చేరారు. తుళ్లూరు మండలంలో శిక్షణ ద్వారా 254 మంది ఉపాధి పొందగా, తాడేపల్లి మండలంలో 51 మంది, మంగళగిరి మండలంలో 33 మంది ఉపాధి పొందారు. శిక్షణ లేకుండా నేరుగా తుళ్లూరు మండలంలో 11 మంది ఉపాధి పొందగా, తాడేపల్లి మండలంలో 28 మంది, మంగళగిరి మండలంలో 80 మంది ఉపాధి పొందారు.
వివిధ సంస్థలలో శిక్షణ
యువతకు ఎల్ అండ్ టీ, షాపూర్జీ అండ్ పలోంజీ, ఏపీఎస్ఏసీఎస్, స్టార్డిజిమ్, కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్, ఏఎస్వీ అండ్ క్యూఎక్స్ వై స్కిల్ ట్రైనింగ్ సెంటర్, ఎమ్మార్వో కార్యాలయం, ఏడీఎస్ సాఫ్ట్ టెక్, సెయింట్ జాన్స్ వెల్ఫేర్, ఏపీఎస్ఎస్ డీసీ, ధాత్రి ఫౌండేషన్, ఇన్ వాల్యూట్ వంటి సంస్థలలో శిక్షణ ఇప్పించారు. వారు ల్యాండ్ సర్వే, ఐటీ-జావా, డ్రైవింగ్, బిజినెస్ కరస్పాండెన్స్, బిజినెస్ ఫెసిలిటేటర్, ఎలక్ట్రికల్, టిజిటైజర్, ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, లాజిస్టిక్స్, హెర్బల్ మేకింగ్, మగ్గం వర్క్, జూట్ బ్యాగ్స్ తయారీ వంటి వాటిలో శిక్షణ పొందారు.
ప్రముఖ సంస్థలలో చేరిక
శిక్షణ పొందినవారితోపాటు పొందనివారు కూడా సీఆర్డీఏ, టాటా పవర్, ఎల్ అండ్ టీ, షాపూర్జీ అండ్ పలోంజీ, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్, ఏపీఎస్ఏసీఎస్, ఏపీఎస్ఎస్ డీసీఏ, గుంటూరు మిర్చి యార్డ్, ఐడియా సెల్యులర్, పైడేటా సర్వీసెస్ వంటి ప్రముఖ సంస్థలలో చేరారు. మరికొందరు వి.డేటా గ్లోబల్ సర్వీసెస్, ప్రణవ్ గ్లోబల్ సొల్యూషన్స్, యురేకా ఫోర్బెస్, శుభగృహ, అపోలో ఫార్మశీ, హెచ్ కేఎం, అమృత పాలీమర్స్, లోకేష్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలలో చేరారు.
విద్యార్హతలు, శిక్షణ ఆధారంగా వారు ఎగ్జిక్యూటివ్ లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లు, డిజిటైజర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్ లు, ఫార్మసిస్టులు, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ లు, సూపర్ వైజర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకొందరు వారు పొందిన శిక్షణతో స్వయం ఉపాధిలో స్థిరపడ్డారు. విద్యార్హతలు తక్కువగా ఉన్నవారికి శిక్షణ బాగా ఉపయోగపడుతోంది. వివిధ వృత్తులలో వారు స్వయం ఉపాధి పొందుతున్నారు.