మీకు ఈ విధంగా సహాయం చేయగలము... 1100కు రోజూ 15 వేలకు పైగా కాల్స్
అది అనంతపురం జిల్లా పరిగి మండలంలోని పుట్టుగురలోపల్లి గ్రామం. గ్రామ నివాసి మూలింటివారు అంజనప్ప వయస్సు 67 సంవత్సరాలు. పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరు కాలేదు. ఎందుకు రాలేదు. ఎక్కడ సమస్య వచ్చిందనేది అంజనప్పకు అర్థం కాలేదు.
అది అనంతపురం జిల్లా పరిగి మండలంలోని పుట్టుగురలోపల్లి గ్రామం. గ్రామ నివాసి మూలింటివారు అంజనప్ప వయస్సు 67 సంవత్సరాలు. పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నాడు. మంజూరు కాలేదు. ఎందుకు రాలేదు. ఎక్కడ సమస్య వచ్చిందనేది అంజనప్పకు అర్థం కాలేదు. సంబంధిత కార్యాలయాలకు వెళ్లాడు. అధికారులను కలిశాడు. మంజూరు కాలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడు అంజనప్పకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి వేదికపై నుంచి చెబుతున్న బ్రహ్మాస్త్రం. అదే 1100. ఫోన్ తీశాడు. 1100కి డయల్ చేశాడు. తేదీ 06.09.2017న కాల్ సెంటర్‌కు అంజనప్ప నుంచి ఫోన్ వచ్చింది.
``నమస్కారం అండీ! నా పేరు ప్రియాంక మేము ఆంధ్రప్రదేశ్ పరిష్కార వేదిక నుంచి మాట్లాడుతున్నాము. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము. అంటూ స్వరం విని అంజనప్ప.. తన పింఛను సమస్యను చెప్పడం ప్రారంభించాడు. ఆవేదన, ఆందోళనతో కూడిన తన గోడును వెళ్లబోసుకున్నాడు. ``మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ ఆధార్ నెంబర్ చెప్పగలరా? అంటూ అడిగిన అంజనప్పకు సంబంధించిన వివరాలు, సమస్యను శాస్త్రీయంగా అప్‌లోడ్ చేసి.. అంజనప్ప పింఛను సమస్యకు సంబంధించిన అర్జీ నంబర్ తెలియజేసింది ప్రియాంక.
ఐదు రోజుల్లోనే మళ్లీ అంజనప్ప 1100కి ఫోన్ చేసి తన పింఛను సంగతి ఏం చేశారని ప్రశ్నించాడు. నమోదైన అర్జీ ఏ విభాగానికి వెళ్లింది.. ఏ దశలో ఉందో తెలియజేశారు. తేదీ 17.09.2017న సంబంధిత అధికారి నుంచి కాల్ సెంటర్‌కు అంజనప్ప పింఛను మంజూరు చేసినట్లు సమాచారం అందింది. తేదీ 22.09.2017న అంజనప్ప తనకు పింఛను మంజూరైందని కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పాడు. వృద్ధుడు, పెద్దగా చదువుకోని, స్మార్ట్ ఫోన్ వాడటం రాని, కాల్ సెంటర్‌తో మాట్లాడటం ఎలాగో కూడా తెలీని అంజనప్ప 1100కి కాల్ చేసి తన సమస్యను తానే పరిష్కరించుకున్నాడు.
ఇలా రోజుకు కొన్ని వేలమంది 1100ని ఆశ్రయిస్తున్నారు. అన్యాయం జరిగిందని ఒకరు.. ఆసరా కావాలని మరొకరు.. అవినీతి పెరిగిందని ఇంకొకరు.. అధికారి వేధిస్తున్నారి మరొకరు.. సకల జనుల సమస్యలూ పరిష్కరించే వేదికగా 1100 నిలుస్తోంది. సమస్యలు అందరికీ ఉంటాయి. కానీ పరిష్కరించుకునే మార్గం తెలియక సతమతమయ్యే వారి పాలిట పిలిస్తే పలికే దైవం 1100. నిరక్షరాస్యులైనా, ఫోన్ చేయడం రాకపోయినా, ఎలా మాట్లాడాలో తెలియకపోయినా ఫర్వాలేదు... కానీ చొరవ తీసుకుని 1100కి ఫోన్ చేయండి. లేదా మీ పిల్లలో, తెలిసిన వాళ్లతో ఫోన్ చేయించండి. మీరు చేయాల్సిందల్లా ఫోన్ చేయడం.
మీరు తెలియజేయాల్సిందల్లా మీ పేరు, ఊరు, మండలం, జిల్లా, ఫోన్, ఆధార్ నెంబర్లు. మీకు ఏ సహాయం కావాలో, ఏ సమస్య పరిష్కారం కావడంలేదో, ఎక్కడ మీ అర్జీ పెండింగ్‌లో ఉందో, ఏ అన్యాయం మీకు జరిగిందో వివరిస్తే చాలు. వేల మంది 24 గంటలూ సదా మీ సేవలో అంటూ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంజనప్ప ఒక్క కాగితం నింపకుండా, ఒక్క కార్యాలయానికి వెళ్లకుండా తన పింఛను సమస్యను తానే పరిష్కరించుకున్నాడు. అంజనప్పలాగే రోజూ 15వేలు కాల్స్ వస్తుంటాయి. వీరి అర్జీల నమోదు, వాటి పరిష్కారం కోసం 2 వేల మంది సిబ్బంది డే అండ్ నైట్ పనిచేస్తూనే ఉన్నారు. సరైన సమాచారంతో 1100కి కాల్ చేస్తే.. సమస్య మీది పరిష్కార బాధ్యత మాది అనే భరోసా ఇస్తున్నారు.
కాలు కదపకుండానే సమస్య పరిష్కారం..
నవ్యాంధ్ర రాజధానిలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా పనిచేస్తోంది ఆంధ్రప్రదేశ్ పరిష్కారవేదిక. పల్లెలో ఓ వ్యక్తికి సమస్య వచ్చింది. ఒక వీధిలో అందరూ ఓ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో అయితే సంబంధిత కార్యాలయానికి వెళ్లేవారు. అధికారికి రాతపూర్వకంగా వినతిపత్రం సమర్పించేవారు. అది పరిష్కారమయ్యిందా? లేదో తెలియాలంటే... ఫిర్యాదుదారుడు, లేదా ఆ గ్రామస్తులు మళ్లీ ఆ కార్యాలయం చుట్టూ తిరిగే వారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
పేపర్‌లెస్.. నో టైమ్ లాస్
కలం, కాగితాలతో పనిలేదు. అంతా పేపర్‌లెస్ వ్యవస్థ. కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగక్కర్లేదు. అంతా ఆన్‌లైన్. టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయడంలో దేశంలోనే ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఆయన కలల రూపమే మీ కోసం, ఆంధ్రప్రదేశ్ పరిష్కారవేదిక. అందులో భాగమైన 1100, కైజాలా, ఏపీ సీఎం కనెక్ట్. నేడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది. వాచ్‌గా, టేప్‌రికార్డర్‌గా, మినీ కంప్యూటర్గా ఉపయోగపడుతున్న మొబైల్ ఫోన్ నే సామాన్యుడి చేతిలో పాశుపతాస్ర్తంగా మార్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
1100, 1800-425-4440 నెంబర్లు గుర్తుంచుకోండి
100కి ఫోన్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. 108 అయితే అంబులెన్స్ వస్తుంది. అలాగే 1100కి కాల్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గుర్తుంచుకోండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక - కాల్ సెంటర్ నెంబర్ 1100కు లేదంటే.. టోల్ ఫ్రీ 1800 - 425 - 4440 నెంబర్లకు ఎవరైనా, ఎప్పుడైనా 24 గంటల్లో తమ సమస్యలు తమ మొబైల్ ఫోన్ నుంచే తెలపవచ్చు.
24 గంటలూ అందుబాటులో..
ఈ మొత్తం వ్యవస్థలో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. సమస్య మీది..పరిష్కార బాధ్యత మాది అని భరోసా ఇస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా 1100తో పాటు టోల్ ఫ్రీ 1800 - 425 - 4440 ఫోన్ చేయడమే. అయితే ఒక పౌరుడు తమ సమస్యను తెలిపే క్రమంలో కాల్‌సెంటర్ సిబ్బంది అడిగే సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. ముందుగా ఫిర్యాదిదారు ఫోన్ నెంబర్, ఆధార్‌కార్డ్ నంబర్, పేరు, ఊరు, మండలం, జిల్లా పరిష్కారవేదిక సిబ్బందికి తెలియజేయాలి. ఈ దశ ముగిసిన తరువాత మీ సమస్య, దాని పూర్తి వివరాలు, ఏ శాఖ, ఏ అధికారి వద్ద సమస్య వంటి వివరాలు కూడా సిబ్బందికి చెప్పినప్పుడే మీ సమస్య సకాలంలో సంబంధితశాఖాధికారికి చేరుతుంది. మొదటిసారి మీరు 1100... టోల్ ఫ్రీ నెంబర్‌కు 1800 - 425 - 4440 ఫోన్ చేసి మీ పూర్తివివరాలు నమోదైనప్పుడు మీకు పరిష్కారవేదిక సిబ్బంది మీ అర్జీ నంబర్ అందిస్తారు. అలాగే మీ మొబైల్ ఫోన్‌కు మీ అర్జీ నెంబర్ మెసేజ్ రూపంలో వస్తుంది.
వివిధ దశలలో..
పరిష్కారవేదికకు వచ్చిన అర్జీని సంబంధిత శాఖకు పంపించి.. అధికారితో మాట్లాడి దాని సాధ్యాసాధ్యాలు చర్చించి వీలైనంత తొందరలో సమస్య పరిష్కరించేందుకు 2000 మందితో కూడా బృందం 24 గంటలూ పనిచేస్తోంది. అర్జీదారుడు తన సమస్య స్థితి తెలుసుకునేందుకు 1100కి ఫోన్ చేసి తన అర్జీ నెంబర్ చెబితే.. అది ఏ దశలో ఉందో కూడా తెలియజేస్తారు. సంబంధిత సమస్య పరిష్కారమైతే వెంటనే అర్జీదారుడి ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ 1100కు ఫోన్ చేసి తెలియజేయవచ్చు. సరైన సమాచారం, వివరాలతో 1100ని సంప్రదించండి. మీ సమస్యలు పరిష్కరించుకోండి.