తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాల్లో గజగజలాడుతున్నారు. ఇక విశాఖ మన్యం ప్రజల సంగతి చెప్పనక్కర్లేదు.
మంగళవారం చింతపల్లిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దట్టమైన పొగమంచుకు తోడు...గడ్డకట్టించే చలితో గిరిజనులు వణుకుతున్నారు. ఉపరితలంపై ఏర్పడిన అధికపీడనంతో పాటు ఈశాన్య గాలులు చలి తీవ్రత పెంచుతున్నాయి.
పగలు కంటే రాత్రిపూట చలి విపరీతంగా ఉంటుంది. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చునని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలోని జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణాల్లో 10 నుండి 11 డిగ్రీల వరకు, విశాఖ ఏజెన్సీలో 1 నుండి 2
డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. విశాఖ ఏజెన్సీలో రికార్డు స్థాయిలో సాధారణం కంటే 4.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో మినుములూరు 7, అరుకులోయలో 10.4, నందిగామలో 12.2, విశాఖలో 13.8, కలింగపట్నం, అమరావతిలో 15.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి.
తెలుగు రాష్ట్రాలలో..
ఇటు తెలంగాణాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 4.3 డిగ్రీలు నమోదు అయ్యాయి. కుమ్రం భీమ్ జిల్లా గిన్నెదరిలో 4.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు దక్షిణ చైనా సముద్ర తీరంలో ప్రసుత్తం తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది క్రమంగా బలహీన పడుతూ బంగాళా ఖాతం వైపు చేరుకుంటుందని, క్రమంగా శ్రీలంక తీరం వైపు కదలనుందని అధికారులు తెలిపారు. దీంతో దక్షిణ కోస్తా జిల్లాలో పలు చోట్ల స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు.