Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సి వస్తుందనే జగన్ తిరుమల పర్యటన రద్దు : సీఎం చంద్రబాబు

Chandra babu Naidu

ఠాగూర్

, శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (19:38 IST)
శ్రీవారి వేంకటేశ్వర స్వామిని తాను నమ్ముతున్నానని, ఆయనపై తనకు పూర్తి విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సివస్తుందన్న భయంతోనే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తనను తిరుమల పర్యటనకు వెళ్లనీయకుండా, స్వామివారిని దర్శనం చేసుకోకుండా ఏపీ ప్రభుత్వం, పోలీసులు అడ్డుకున్నారంటూ జగన్ శుక్రవారం ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. 
 
జగన్‌ను తిరుమలకు వెళ్ల వద్దని ఎవరూ చెప్పలేదని, ర్యాలీలు, జనసమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పామన్నారు. తిరుమల అంశంపై జగన్‌ చేసిన ఆరోపణలు ఖండించారు. నోటీసులు ఇచ్చారు, నిలుపుదల చేశారని ఆరోపిస్తున్నారు.. జగన్‌కు ఏమైనా పోలీసులు నోటీసులు ఇచ్చారా? అని ప్రశ్నించారు. జగన్‌ను వెళ్లొద్దని నోటీసులు ఇస్తే.. మీడియాకు చూపించాలని డిమాండ్‌ చేశారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ.. ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
 
'ఇటీవల తితిదేలో చోటుచేసుకున్న పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో భక్తులు ఆందోళనలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో తిరుపతిలో సెక్షన్‌ 30 పోలీసు యాక్ట్‌ అమల్లో ఉంది. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. తిరుమలకు వెళ్లాలంటే ఎవరైనా ఆచారాలు, నియమాలు పాటించాల్సిందే. ఆచారాలు పాటించకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. భక్తులు పవిత్రంగా భావించే క్షేత్రాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇతర మతాలను గౌరవించాలి. సొంత మతాన్ని ఆచరించాలి' అని చంద్రబాబు అన్నారు.
 
'ఇంతకుముందు జగన్‌ నియమాలు ఉల్లంఘించి తిరుమల వెళ్లారు. చాలా మంది డిక్లరేషన్‌ ఇచ్చి గౌరవంగా దర్శనం చేసుకున్నారు. ఇతర మతాలను గౌరవించడం అంటే.. ఆయా ఆలయాల సంప్రదాయాలను పాటించడమే. బైబిల్‌ను నాలుగు గోడల మధ్యే ఎందుకు చదవాలి.. చర్చికి కూడా వెళ్లి బైబిల్‌ చదవొచ్చు. చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతున్నారు. నెయ్యి కల్తీ జరగలేదని అంటున్నారు. ఏఆర్‌ డెయిరీ 8 ట్యాంకర్లు పంపింది.. అందులో 4 ట్యాంకర్లు వాడారు. ఈ నివేదిక ఇచ్చింది ఎన్‌డీడీబీ.. మేం కాదు. ఈ నివేదిక దాస్తే మేం తప్పు చేసినట్లే అవుతుంది. నెయ్యి కల్తీ జరగలేదని మీరు ఎలా చెబుతున్నారు. 
 
అడల్టరేషన్ పరీక్షకు గతంలో మీరు ఎందుకు పంపలేదు? టెండర్లు పిలిచేందుకు నిబంధనలు ఎందుకు మార్చారో చెప్పాలి? నాసిరకం పదార్థాలతో ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. ఈవో చెప్పలేదు.. నివేదికలు లేవు అంటూ అబద్ధాలు చెబుతున్నారు. రామతీర్థం, అంతర్వేది ఘటనలపై ఇప్పటివరకు విచారణ జరగలేదు. క్రైస్తవుడిని అని ఒప్పుకొన్నాక డిక్లరేషన్‌ ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటి? మీరు చేసిన అబద్ధాలను ఖండించకుంటే అవే నిజమని అనుకుంటారు. తప్పు జరిగినప్పుడు విచారం వ్యక్తం చేయాలి. ఎదురుదాడి కాదు. స్వామి వారికి మీరు చేసిన అపచారాలు నేను కప్పిపుచ్చాలా? రాజకీయ ముసుగులో నేరస్థులు వస్తే ఇలాంటివే జరుగుతాయి' 
 
'రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు, అర్హతలు మీకున్నాయా? ఇష్టమైతేనే తిరుమలకు వెళ్లండి లేకపోతే వెళ్లొద్దు. తిరుమలకు వెళ్తే ఆలయ సంప్రదాయాలు పాటించాల్సిందే. అన్యమతస్థులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే. భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకెవరిచ్చారు. దళితులను ఆలయాల్లోకి రానీయడం లేదని మీకెవరు చెప్పారు? సీఎంగా ఉన్నప్పుడే చట్టాలను ఉల్లంఘించానని ఎలా చెబుతారు? చట్టాలను సంప్రదాయాలను గౌరవించడంలో మొదటి వ్యక్తిగా సీఎం ఉండాలి. 
 
స్వామివారిని రాజకీయాలకు, వ్యాపారాలకు వాడుకోవడం మీరు చేసిన తప్పు. తితిదే అధికారుల నియామకంలో మీరు చేసింది అధికార దుర్వినియోగం. తిరుమలలో తెలిసీ తెలియక పొరపాట్లు చేస్తే సంప్రోక్షణ చేస్తారు. ఈ నెల 23న శాంతియాగం చేశారు. క్వాలిటీ, స్వచ్ఛత పవిత్రత చాలా ముఖ్యం. వేంకటేశ్వరస్వామి సన్నిధిలో అపవిత్రత జరగకుండా చూస్తాం. కల్తీ ఘటనలో తప్పు చేసిన అందరిపై చర్యలు ఉంటాయి' అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ హయాంలోనే లడ్డూ పాపం.. ముగ్గురిది నీచ రాజకీయాలు.. షర్మిల