ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు భగ్గుమన్నారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యాక అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన.. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత భ్రష్టు పట్టిస్తారంటూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇది పిచ్చి తుగ్లక్ పాలన అని నిప్పులు చెరిగారు.
'మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారు? సీఎం ఇక్కడ కూర్చుంటారా? లేక విశాఖ, కర్నూలులో ఉంటారా? ఈ నిర్ణయం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. ప్రజలు మూడు రాజధానుల్లో తిరిగి పనులు చేసుకుంటారా? ప్రజలు అమరావతిలో ఒక ఇల్లు, కర్నూలులో మరో ఇల్లు కట్టుకుంటారా? విశాఖలో సెక్రటేరియట్ కట్టి ఏం చేస్తారు? మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే డబ్బులు ఉండాలి కదా?
మండలానికి ఒక ఆఫీసు పెట్టుకోండి ఇంకా బాగుంటుంది. మూడు రాజధానులలో మంత్రులను ఏ రాజధానిలో పెట్టబోతున్నారో చెప్పాలి. అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేసి రాజధానిపై నిర్ణయం తీసుకుంటున్నారు' అంటూ సీఎం జగన్ నిర్ణయంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.