వైసీపీ పాలనకు ఏడాది పూర్తయ్యింది. కొత్త ప్రభుత్వం, అనుభవం లేని ముఖ్యమంత్రి కాబట్టి ఆరు నెలల వరకు ప్రభుత్వానికి సహకరించాలని అనుకున్నాం. కానీ తొలిరోజు నుంచే వైసీపీ పాలకులు అరాచకాలు మొదలుపెట్టారంటూ.. ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.
వైసీపీ ఏడాది పాలనలో ప్రజలు ఎంత విసుగెత్తిపోయారో, బూటకపు మాటలను నమ్మి ఎంత మోసపోయారో చెబుతున్న వీడియోను కూడా చంద్రబాబు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తొలి ఏడాది పాలన ఏ ప్రభుత్వానికైనా కీలకం. ట్రైలర్ చూస్తేనే ఇలా ఉంటే రాబోయే కాలం ఇంకెలా బెంబేలెత్తిస్తారో..! హతవిధీ.. అంటూ ట్వీట్ చేశారు.
ఇటు న్యాయం కోసం అమరావతి ప్రజలు, అటు విశాఖలో విషవాయు బాధితులు, మరోవైపు కరోనాతో కర్నూలు వాసులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు లేక రైతులు, ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, పెట్టుబడులు వెనక్కి పోయి ఉద్యోగాలు లేని యువత నానా తంటాలు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ని విషాదాల్లో వైసీపీ ఏడాది పాలన ఉత్సవాలా..? ఏం సాధించారని...? ఎవరికేం ఒరగబెట్టారని..? ఇకనైనా బాధ్యతగా పనిచేయండంటూ బాబు వ్యాఖ్యానించారు.