Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుకు అతిపెద్ద ఎదురుదెబ్బ: ఓటుకు నోట్లు కేసులో వివరణ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు

గత 30 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఏ కోర్టుకూ దొరక్కుండా ఎన్ని కేసులు పెట్టినా చిక్కకుండా తప్పించుకుంటూ వచ్చిన తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సుప్రీంకోర్టు అడ్డంగా బుక్ చేసిందా? ఓటుకు కో్ట్లు కేసులో చంద్రబాబు పాత్ర లేదంటూ విచారణనే కొట్

Advertiesment
చంద్రబాబుకు అతిపెద్ద ఎదురుదెబ్బ: ఓటుకు నోట్లు కేసులో వివరణ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు
హైదరాబాద్ , మంగళవారం, 7 మార్చి 2017 (04:44 IST)
గత 30 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఏ కోర్టుకూ దొరక్కుండా ఎన్ని కేసులు పెట్టినా చిక్కకుండా తప్పించుకుంటూ వచ్చిన తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సుప్రీంకోర్టు అడ్డంగా బుక్ చేసిందా? ఓటుకు కో్ట్లు కేసులో చంద్రబాబు పాత్ర లేదంటూ విచారణనే కొట్టివేసిన ఏపీ హైకోర్టుకు భిన్నంగా ఏకవాక్య ప్రకటనతో సుప్రీంకోర్టు ఆ కేసును మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ‘‘ఇది వినవలసిన కేసు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. కేసు త్వరిగతిన విచారణకు వచ్చేలా చూస్తాం’’అని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్టు తెలిపింది.  

 
ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం చంద్రబాబును ఆదేశించింది. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయనతోపాటు తెలంగాణ ఏసీబీకి సైతం నోటీసులు ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను కౌంటర్ల రూపంలో తమ ముందుంచాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు కోట్లు వ్యవహారానికి సంబంధించిన ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
 
ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని, ఏసీబీ అధికారులు చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఆగస్టు 8న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ గత ఏడాది ఆగస్టు 29న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబునాయుడు సెప్టెంబర్‌ 1న హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ సెప్టెంబర్‌ 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ తాళ్లూరి సునీల్‌ చౌదరి విచారణ జరిపారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో 22 సార్లు చంద్రబాబునాయుడు ప్రస్తావన వచ్చిందని, అయితే ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయడం లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ కేసు మొదట్లో దర్యాప్తును వేగంగా ప్రారంభించిన ఏసీబీ అధికారులు తరువాత కీలక దర్యాప్తును పక్కనపెట్టేశారన్నారు. దీంతో తాము ఏసీబీ ప్రత్యేక కోర్టు వాస్తవాలను బహిర్గతం చేయాలన్న ఉద్దేశంతో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రత్యేక కోర్టు తాము తమ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో వాస్తవం ఉందో లేదో దర్యాప్తు చేయాలని మాత్రమే ఏసీబీని ఆదేశించిందని వివరించారు. ఏసీబీ అధికారులు చంద్రబాబు స్వర నమూనాల జోలికి వెళ్లలేదని ఆయన తెలిపారు.
 
ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు ఇవ్వడం అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌) పరిధిలోకి రాదని చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తెలిపారు. ఓటు వేయడమన్నది ప్రజా విధుల్లో భాగం కాదని, అది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యత మాత్రమేనని ఆయన తెలిపారు. అంతేకాక ఎన్నికైన వ్యక్తి ప్రజా సేవకుడిగా బాధ్యతలు నిర్వరిస్తున్న సందర్భంలో అవినీతికి పాల్పడితే అప్పుడు మాత్రమే పీసీ యాక్ట్‌ వర్తిస్తుందని ఆయన వివరించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ సునీల్‌ చౌదరి డిసెంబర్‌ 9న తీర్పు వెలువరించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత అతనికి లేదని తేల్చి చెప్పింది. అంతేకాక చంద్రబాబు ఫోన్‌ సంభాషణ ఆధారంగా అతన్ని ఈ కేసులో లాగేందుకు ఆ తరువాత నిర్ధిష్టమైన ఆరోపణలు చేశారన్న న్యాయమూర్తి.. అతను స్టీఫెన్‌సన్‌కు లంచం ఇవ్వజూపలేదని తేల్చేశారు. 
 
ఈ తీర్పును సవాలు చేస్తూ రామకృష్ణారెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేశారు. నేర విచారణ స్మృతి (సీఆర్‌పీసీ) సెక్షన్‌ 39, 190 ప్రకారం తనకు ఈ కేసులో జోక్యం చేసుకొనే అర్హత ఉందని రామకృష్ణారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నేరం ఎవరు చేసినా.. ఆ నేరాన్ని చూసిన వ్యక్తి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని చట్టం, సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను రూ. ఐదు కోట్లకు కొనాలని చూశారని, ఇది అవినీతి కిందికే వస్తుందన్నారు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు స్వయంగా ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. ఈ ఫోన్‌ సంభాషణలో ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సైతం నిర్ధారించిందన్నారు. ఏసీబీ అధికారులు సైతం తాము దాఖలు చేసిన చార్జిషీట్‌లో చంద్రబాబు పేరును 22 సార్లకు పైగా ప్రస్తావించారన్నారు. కానీ అదే ఏసీబీ చంద్రబాబును మాత్రం విచారించలేదన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చే విషయంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని వివరించారు. ఈ విషయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
 
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, తంగిరాల విజయభాస్కర్‌రెడ్డిలు హాజరయ్యారు. కేసు విచారణకు రాగానే చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా స్పందిస్తూ... ఈ కేసులో జోక్యం చేసుకునే ఈ కేసులో పిటిషనర్‌కు జోక్యం చేసుకొనే అర్హత లేదని హైకోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఇది వినవలసిన కేసు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. కేసు త్వరిగతిన విచారణకు వచ్చేలా చూస్తాం’’అని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌ చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాంకేతిక కారణాలతో కేసునుంచి తప్పిస్తారా? అద్వానీని మళ్లీ బుక్ చేసిన 'సుప్రీం'