దసరా పండుగ రోజున ఏపీ రాజధాని అమరావతి భూమిపూజ కార్యక్రమాన్ని ఎంత వైభవంగా నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం కోసం దాదాపు రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేశారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా పూర్తి కాకుండా.. అమరావతి నిర్మాణం అట్టహాసంగా ఉంటుందన్న విషయం అర్థమయ్యేలా నిర్వహించారనే చెప్పాలి.
ఇక.. శంకుస్థాపన కోసం ఏపీలోని గ్రామ.. గ్రామాల్లో నుంచి మట్టి.. నీరు తెప్పించి.. అంతా కలిపి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేయటం ద్వారా.. అమరావతి నిర్మాణం ఏపీ ప్రజలందరి భాగస్వామ్యంతో సాగుతుందన్న భావన కలిగేలా ఏపీ సీఎం చంద్రబాబు చేశారు. ఘనంగా నిర్వహించిన తర్వాత శంకుస్థాపన ప్రాంతం.. యాగశాల.. అక్కడ ఏర్పాటు చేసిన దేవతామూర్తులు.. అఖండ జ్యోతి విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అఖండ జ్యోతి ఆరిపోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దురదృష్టవశాత్తు ఈ జ్యోతి ఎప్పుడో ఆరిపోయింది. అయితే.. కోటప్ప కొండకు తరలించటం ద్వారా అఖండజ్యోతి ఆరిపోలేదని చెప్పినా.. దీన్ని ఏర్పాటు చేసిన చోట ఒక శాశ్వత కట్టడం కట్టి ఉంటే బాగుండేది. కానీ.. అలాంటివేమీ జరగలేదు. తాజాగా భారీగా వీచిన గాలులకు అఖండ జ్యోతి స్టాండ్ కొట్టుకుపోవటంతో పాటు.. యాగశాల కూలిపోవటం గమనార్హం.