Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరోగ్య శ్రీ జాబితా నుంచి తొలగిస్తాం.. ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ హెచ్చరిక

Advertiesment
ఆరోగ్య శ్రీ జాబితా నుంచి తొలగిస్తాం.. ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ హెచ్చరిక
, ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (19:16 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో మాత్రం దాదాపు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 
 
ఇక కరోనా అలుసుగా చేసుకున్న ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు ధరలు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. సీటీ స్కాన్‌ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధితుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది.
 
సిటీ స్కాన్‌, పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కోవిడ్‌-19 డాష్‌ బోర్డులో పాజిటివ్‌ వచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
కాగా, కరోనా పేషెంట్ల చికిత్సలపై వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1.01 లక్షల మంది కోవిడ్‌ రోగులకు ఉచితంగా వైద్యసేవలను అందించింది. ఇందుకోసం ఏకంగా రూ.309.61 కోట్లను ఖర్చు చేసింది. 
 
గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆరోగ్యశ్రీ కింద ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కోవిడ్‌ రోగులకు ప్రభుత్వం ఉచిత చికిత్సలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈనెల 23 వరకు మొత్తం 1,01,387 మంది బాధితులు ఉచిత వైద్యం పొందారు.
 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కొరల చాస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 62,885 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 12,634 పాజిటివ్‌‌గా తేలింది. 69 మంది మృతి చెందినట్లు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 
 
ఇప్పటివరకు రాష్ట్రంలో 10,33,560 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,59,31,722 కరోనా శాంపిళ్లను సేకరించి పరీక్షించింది.
 
ఇక కరోనాతో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో ఏడుగురు, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున, అనంతపురం, కడప ఐదుగురు చొప్పున, చిత్తూరు, గుంటూరులో నలుగురు చొప్పున, ప్రకాశం, విజయనగరంలో ముగ్గురు చొప్పున, కర్నూలులో ఇద్దరు మరణించారు. 
 
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7,685 మంది మృతి చెందారు. ఇక తాజాగా 4,304 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,36,143కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 89,732 యాక్టివ్‌ కేసులున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18ఏళ్లకు పైబడినవారు కోవిడ్ వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకునే విధానం