ఇంధన సంక్షోభం, విద్యుత్ ధరలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. బొగ్గు కొరత వల్ల విద్యుత్ ప్లాంట్లు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద ఒకటి రెండు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయన్నారు.
కొవిడ్ తరువాత విద్యుత్ వినియోగం 20మేర పెరిగిందన్నారు. ప్రస్తుతం 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందన్నారు. ఏపీ జెన్‌కో 45 శాతం రాష్ట్ర అవసరాలను మాత్రమే తీర్చగలుగుతోందని.. కొన్నిసార్లు విద్యుత్ కొనుగోలు చేయాలంటే యూనిట్‌కు 20 రూపాయలు చెల్లించాల్సి వస్తుందన్నారు.
బొగ్గు కొరత దేశంలోని విద్యుత్ ప్లాంట్లను సంక్షోభం దిశగా నెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామర్థ్యంతోనే పనిచేస్తున్నాయన్నారు. రోజుకు 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం 50 శాతం మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోందంటూ లేఖలో సీఎం పేర్కొన్నారు.
కొంతకాలంగా పనిచేయని బొగ్గు ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. ఓఎన్‌జీసీ, రియలన్స్ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్ సరఫరా చేయాలని కోరుతున్నామన్నారు. విద్యుత్ డిస్కంలకు బ్యాంకుల ద్వారా సులభతరమైన రుణాలివ్వాలని.. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలను పునరుద్ధరించి మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సీఎం జగన్ లేఖలో కోరారు.