అమరావతిని రాజధానిగా అభివృద్ది చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం సంచలన తీర్పును వెలువరించింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. హైకోర్టు తీర్పు సర్కారుకు చెంపదెబ్బ వంటిందన్నారు. ఈ తీర్పుతో అయినా సిగ్గు తెచ్చుకుంటే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. అదేసమయంలో హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మూడు రాజధానుల బిల్లు చెల్లదని తాము మొదటి నుంచి మొత్తుకుంటున్నామన్నారు. హైకోర్టు తీర్పుతో ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వ్యాఖ్యానించారు. హైకోర్టు నిర్ణయాన్ని గౌరవించాలని, హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లరాదని సూచించారు.
కోర్టు చెప్పిన విధంగా రాజధానిగా అమరావతిని, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులను సీఆర్డీఏ చట్టం ప్రకారం ఆదుుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే ఏపీ అభివృద్ధి ఆగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.