ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనింగ్ శాఖలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డికి శుక్రవారం గుట్టుచప్పుడు కాకుండా బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని అరెస్టు అయిన విషయం తెల్సిందే. ఇపుడు బెయిల్ రావడంతో చడీచప్పుడు కాకుండా జైలు నుంచి విడుదలయ్యారు. పైగా, వెంకట రెడ్డికి బెయిల్ ఇచ్చే విషయంలో ఏసీబీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
గనుల శాఖకు చెందిన రూ.160 కోట్లను ఎవరి ప్రమేయమూ లేకుండా దారి మళ్లించారని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) నిర్ధారించి సెప్టెంబరు 11వ తేదీన వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసింది. అదే నెల 26న రాత్రి హైదరాబాద్ నగరంలో ఆయన అరెస్టయ్యారు. ఆ తర్వాత విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం 50 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన అనారోగ్య కారణాలతో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.
శుక్రవారం ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయాధికారి హిమబిందు వెంకటరెడ్డికి బెయిలు మంజూరు చేశారు. రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఈ సందర్భంగా కోర్టు ఆంక్షలు విధించింది. ప్రస్తుత, పూర్వ చిరునామాను కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. ప్రతి శనివారం ఏసీబీ సీఐయూ అధికారుల ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది.