Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ రహదారి... 26,890 ఎకరాల భూసేకరణకు నిర్ణయం

నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టు చేపట్టింది. అనంతపురం నుంచి అమరావతి వరకు ఎక్కడా మలుపులేని 598.830 కిలోమీటర్ల ఆరు లైన్ల ఎక్స్ ప్రెస్ రహదారి నిర్మాణానికి 26,890 (10,843 హెక్టార్లు) ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. ఇంద

అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ రహదారి... 26,890 ఎకరాల భూసేకరణకు నిర్ణయం
, శుక్రవారం, 9 డిశెంబరు 2016 (19:39 IST)
నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టు చేపట్టింది. అనంతపురం నుంచి అమరావతి వరకు  ఎక్కడా మలుపులేని 598.830 కిలోమీటర్ల ఆరు లైన్ల ఎక్స్ ప్రెస్ రహదారి నిర్మాణానికి 26,890 (10,843 హెక్టార్లు) ఎకరాల భూమిని సేకరించాలని  నిర్ణయించింది. ఇందులో 1518.75 హెక్టార్ల అటవీ భూమి ఉంది.  పరిస్థితులను బట్టి సేకరణ లేక సమీకరణ ద్వారా ఈ భూమిని సమకూరుస్తారు.  ఇంత దూరం రోడ్డు మలుపులేకుండా కొనసాగించడానికి అవసరమైన చోట సొరంగమార్గాలు, వంతెనలు నిర్మిస్తారు. దేశంలో ఎక్కడా ఇటువంటి రహదారిలేదు. ఇదే మొదటిది. 
 
అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో  29,912 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మిస్తారు. మలుపులేని ఈ రోడ్డుకు కలుపుతూ కడప, కర్నూలు నుంచి మరో రెండు రోడ్లు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రోడ్డు నిర్మాణానికి రూ.27,635 కోట్లు, భూ సేకరణకు రూ.2000 కోట్లు, పర్యావరణానికి (రోడ్డు నిర్మాణ వ్యయంలో ఒక శాతం) రూ.276.35 కోట్లుగా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రోడ్డుకు కావలసిన భూమిని సమకూరిస్తే,  ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా  నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ ఏఐ)ను కేంద్రం ఆదేశించింది. 
 
ఆరులైన్ల రహదారి
అనంతపురం రహదారిని ప్రకాశం జిల్లా వరకు తొలుత నాలుగులైన్లలో నిర్మించాలని అనుకున్నారు. అలాగే కర్నూలు నుంచి, కడప నుంచి నిర్మించే వాటిని కూడా ప్రకాశం జిల్లా వరకు నాలుగు లైన్లు నిర్మించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు వాటిని కూడా ఆరు లైన్లలో నిర్మించాలని ప్రతిపాదించారు. భూమిని మాత్రం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందు చూపుతో 8 లైన్లకు సరిపడ సేకరిస్తారు. సేకరణ లేక ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సమకూర్చే బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. అంతే కాకుండా త్వరితగతిన ఈ రోడ్డుకు సంబంధించిన సర్వే పూర్తి చేసి, కావలసిన భూమిలో ప్రభుత్వ, ప్రైవేటు భూమి వివరాలు తెలుపమని కూడా కలెక్టర్లను ఆదేశించారు. 
 
ప్రకాశం జిల్లాలో అత్యధిక భూమి సేకరణ
రోడ్డు పొడవును జిల్లాల వారీగా పరిశీలిస్తే ప్రకాశం జిల్లాలో అత్యధిక పొడవు 223.950 కిలో మీటర్లు ఉంటుంది. అందువల్ల ఈ జిల్లాలో అత్యధికంగా 3351 హెక్టార్లు సేకరిస్తారు. అనంతపురం జిల్లాలో 68.650 కిలోమీటర్ల రోడ్డుకు 1268 హెక్టార్ల భూమి, కర్నూలు జిల్లాలో 160.600 కిలోమీటర్ల రోడ్డుకు 2281 హెక్టార్లు, కడప జిల్లాలో 62.200 కిలోమీటర్ల రోడ్డుకు 824.25 హెక్టార్లు, గుంటూరు జిల్లాలో 80.430 కిలో మీటర్ల రోడ్డుకు 1600 హెక్టార్ల భూమి సేకరిస్తారు. సేకరించే దానిలో అటవీ భూమి కూడా అత్యధికంగా ప్రకాశం జిల్లాలోనే 742 హెక్టార్లు ఉంది. మిగిలిని జిల్లాలను పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో 86 హెక్టార్లు, కర్నూలు జిల్లాలో 582 హెక్టార్లు, కడప జిల్లాలో 108.75 హెక్టాల భూమి సేకరిస్తారు. గుంటూరు జిల్లాలో అటవీ భూమి లేదు.  5 జిల్లాలలో నిర్మించే ఈ రోడ్డుని పూర్తి స్థాయి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేగా అభివృద్ధి చేస్తారు. ఈ రోడ్డుపై వాహనాలు 120 కిలో మీటర్ల వేగంతో వెళ్లే విధంగా ప్లాన్ రూపొందించారు. 
 
ఈ రోడ్డుకు కావలసిన భూమి మొత్తాన్ని సేకరణ లేక సమీకరణ ద్వారా ఆరు నెలలలో సమకూర్చుకొని, రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. భూ సేకరణకు 5 జిల్లాలలో వేరువేరుగా భూసేకరణ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఒక అటవీ సెల్ ను కూడా ఏర్పాటు చేస్తారు. అటవీ భూములకు కావలసిన అనుమతులు పొందే వ్యవహారాలను ఈ సెల్ చూస్తుంది. 
 
3వ అతి పెద్ద ప్రాజెక్టు
నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టు అంతర్జాతీయ స్థాయిలో నూతన రాజధాని ఆధుని అమరావతి నిర్మాణం. ఆ తరువాతది పోలవరం ప్రాజెక్ట్. మూడవ భారీ  ప్రాజెక్ట్ అనంతపురం–అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే. 
 
రాయలసీమకు మహర్ధశ
ఇది పూర్తి అయితే రాయలసీమ ముఖచిత్రం మారిపోతుంది. మహర్ధశ పట్టే అవకాశం ఉంది.  రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఇది కీలకమవుతుంది. భారీ స్థాయిలో రహదారులు నిర్మించడం వల్ల  ఆ మూడు జిల్లాల నుంచి రాజధాని అమరావతికి త్వరగా రావచ్చు. రవాణాకు అనుకూలత ఏర్పడుతుంది. రహదారుల వెంట పలు రకాల పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ రకంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధిలో రాయలసీమకు కూడా తగిన భాగస్వామ్యం ఉంటుంది. అంతే కాకుండా దీని ద్వారా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ నగరాలకు అనుసంధానం ఏర్పడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకు సిబ్బందికి ధన దాహం... 44 నకిలీ ఖాతాల సృష్టి.. రూ.100 కోట్ల బ్లాక్ మనీ డిపాజిట్