Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ కోర్టుకు ‘అమరావతి’..78వ రోజుకు ఆందోళన

అంతర్జాతీయ కోర్టుకు ‘అమరావతి’..78వ రోజుకు ఆందోళన
, బుధవారం, 4 మార్చి 2020 (08:08 IST)
అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు 78వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో రైతుల ధర్నా కొనసాగుతోంది.

వెలగపూడిలో 78వ రోజు రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు చేయనున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
 
రాష్ట్రరాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని మొదటి నుంచి ఖండిస్తున్న ఎన్నారైలు.. తాజాగా మరోముందడుగు వేశారు. వైసీపీ ప్రభుత్వ తీరును అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు.

ఇందులో భాగంగా ఎన్నారైలు..ది హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ.. యూఎస్ ఎన్నారైల తరఫున శ్రీనివాస్ కావేటి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో మార్చి 2న పిటిషన్ దాఖలు చేశారు.

అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించే విధంగా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసి, అమరావతి రైతులకు న్యాయం చేయాలని పిటిషన్‌లో ఎన్నారైలు కోరారు. కాగా.. అమరావతి విషయంలో ఎన్నారైలు వేసిన పిటిషన్‌ను కోర్టు స్వీకరించింది. 
 
టీడీపీ ప్రభుత్వం రాష్ట్రరాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కూడా టీడీపీ నిర్ణయాన్ని స్వాగతించారు.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన జగన్.. రాజధాని విషయంలో ఒక్కసారిగా మాట మార్చారు. కేవలం ఒక వర్గానికి మేలు చేయడం కోసమే టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిందని ఆరోపించారు.

అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేశారని ఆరోపిస్తూ.. మూడు రాజధానిల ప్రక్రియను తెరమీదకు తెచ్చారు. ఈ నేపథ్యంలో రాజధానికి భూములిచ్చిన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న అమరావతి రైతులకు వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతోంది.

న్యాయం చేయాలంటూ రోడ్లపైకి వచ్చిన రైతులను పోలీసుల సాయంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో మొదటి నుంచి అమరావతి రైతులకు అండగా ఉన్న ఎన్నారైలు.. తాజాగా ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో జరిగిన మానవహక్కుల ఉల్లంఘనలను యూఎన్ఓ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామని ఎన్నారైలు స్పష్టం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందుకే ప్రజలు తిరగబడుతున్నారు: మంత్రి పిల్లి సుభాష్ షాకింగ్ కామెంట్స్