Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయదశమికి అమరావతి పాలన నగర నిర్మాణం: మంత్రి నారాయణ

అమరావతి: విజయదశమికి ప్రజా రాజధాని అమరావతి పాలన నగర నిర్మాణ పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి పి.నారాయణ తెలిపారు. సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు, నార్మన్‌ ఫోస్టర్‌, హఫీజ్

విజయదశమికి అమరావతి పాలన నగర నిర్మాణం: మంత్రి నారాయణ
, శుక్రవారం, 14 జులై 2017 (18:58 IST)
అమరావతి: విజయదశమికి ప్రజా రాజధాని అమరావతి పాలన నగర నిర్మాణ పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి పి.నారాయణ తెలిపారు. సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ, సీఆర్డీఏ అధికారులు, నార్మన్‌ ఫోస్టర్‌, హఫీజ్ కాంట్రాక్టర్, చంద్రశేఖర్ అండ్ కన్సల్టెంట్ ప్రతినిధులతో సమావేశమై అమరావతి మాస్టర్ ప్లాన్ పైన చర్చించారు. అనంతరం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంత్రి నారాయణ సమావేశం వివరాలు మీడియాకు వివరించారు. 
 
అమరావతి నిర్మాణం ‘సింబల్ ఆఫ్ ప్రైడ్’గా, పోలవరం నిర్మాణం ‘సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్’గా ముఖ్యమంత్రి అభివర్ణించినట్లు చెప్పారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు అంతిమంగా సౌభాగ్యం, సంతోషాలకు సూచికలుగా సీఎం పేర్కొన్నట్లు తెలిపారు. 900 ఎకరాలలో శాసనసభ, సచివాలయం, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ఇతర సిబ్బంది నివాస భవనాలు, 450 ఎకరాల్లో హైకోర్టు, జడ్జిలు, అధికారుల నివాస భవనాలు నిర్మిస్తారని వివరించారు. 
 
మొత్తం 1350 ఎకరాల్లో ఈ నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు. శాసనసభ కోహినూర్ డైమండ్ నమూనాలో, హైకోర్టు గోపురం నమూనాలో ఉంటాయని తెలిపారు. సచివాలయ భవనాలు 10 అంతస్థులు నిర్మిస్తారన్నారు. మంత్రులు, సచివాలయం, హెచ్ఓడీలు ఒకే ఫ్లోర్‌లో ఉంటారని తెలిపారు. 
 
మొత్తం భూమిలో 50 శాతం పచ్చదనం-జలం(బ్లూ-గ్రీన్)తో నిండి ఉంటుందన్నారు. వీటిమధ్యలో 500 అడుగుల ఎత్తులో ఐకానిక్ టవర్ నిర్మిస్తారని, దీనిపై నుంచి చూస్తే  217 చదరపు కిలోమీటర్ల రాజధాని ప్రాంతం మొత్తం కనిపిస్తుందని తెలిపారు. దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. పరిపాలన నగరానికి ఒకవైపు నందమూరి తారక రామారావు, మరోవైపు అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. నది నుంచి వరుసగా శాసనసభ, సచివాలయం, హైకోర్టు తరువాత శాఖమూరి పార్కు వస్తుందని చెప్పారు.  కృష్ణా నది పక్కన బహుళ ప్రయోజనాలకు కొంత స్థలం వదిలినట్లు తెలిపారు. 
 
ఫోస్టర్స్ వారు ఆగస్టు 15 నాటికి శాసనసభ సవివర ఆకృతులు అందజేస్తారని, హఫీజ్ కాంట్రాక్టర్స్ వారు స్ట్రక్చరల్ డిజైన్ అందజేస్తారని, సెప్టెంబర్ నెలలో టెండర్లు పిలిచి విజయదశమికి పనులు ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే హైకోర్టు ఆకృతులు ఆగస్ట్ 30 నాటికి అందజేస్తారని, సెప్టెంబర్ 15 నాటికి స్ట్రక్చరల్ డిజైన్స్ అందజేస్తారన్నరు. డిజైన్లు అందిన నెల రోజుల లోపల సీఆర్డీఏ టెండర్లు పిలవడం పూర్తి చేస్తుందని చెప్పారు. ఏడాదిన్నరలో సీఆర్డీఏ మంచి రాజధాని నిర్మిస్తుందన్నారు. ఫోస్టర్స్ వారు హైకోర్టు ఆకృతులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మరో ఏడుగురు సభ్యుల బృందానికి చూపించారని, వారి సూచనల మేరకు ఆకృతుల్లో కొన్ని మార్పులు చేసినట్లు తెలిపారు.
 
ఫోస్టర్స్ వారు అందించే తుది ఆకృతులపై కొత్తగా ఎన్నికయ్యే రాష్ట్రపతికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఈ సమావేశంలో కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ్య కూడా పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ ఎమ్మెల్యే రోజాకు 'జబర్దస్త్‌' ఆర్టిస్ట్‌లు సంభాషణలు రాసిస్తున్నారా?