రాష్ట్రవ్యాప్తంగా గా 41,37,675 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈనెల 5 నుంచి నూతన ఇసుక విధానం అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను వినియోగదారులకు సప్లై చేశామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో 102 ఇసుక రీచ్ లను, 51 స్టాక్ యార్డ్ లను సిద్ధం చేశామన్నారు. మొత్తం 41 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక సప్లై కోసం టెండర్లు కూడా పిలవడం జరిగిందని తెలిపారు. గోదావరి, కృష్ణానదిలో వరద కారణంగా ఇసుక రవాణా కొంత ఇబ్బందికరంగా మారిందని అన్నారు.
వరదలు తగ్గుముఖం పట్టగానే పూర్తిస్థాయిలో ఏపీఎండీసీ ద్వారా ఇసుక రవాణా కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 స్టాక్ యార్డ్ లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 20 వేయింగ్ మిషన్ లను ఇందుకోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పట్టాదారు భూమి నుంచి కూడా ఇసుక సరఫరా కొరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో రైతాంగం ఎక్కువమంది సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేరు వాగులో దాదాపు 263 ఎకరాలలో ఇసుక టెండర్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిందని వెల్లడించారు.
అలాగే నెల్లూరు జిల్లాలో 12 రీచ్ ల నుంచి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను, రోజుకు పది వేల క్యూబిక్ మీటర్ల మేర సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గుంటూరు, కృష్ణ, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో కొత్త రీచ్ లను గుర్తించడం జరిగిందన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో పడవల ద్వారా ఇసుకను తీసుకు వచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం జరిగిందని వివరించారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద పరిస్థితులు తగ్గుముఖం పట్టగానే అవసరానికి తగినంత ఇసుక నిల్వలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.