Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హరీష్ రావు వార్నింగ్ : జగన్ పిచ్చి ప్రేలాపనలు మానుకో!

Advertiesment
హరీష్ రావు
, మంగళవారం, 1 అక్టోబరు 2013 (16:25 IST)
File
FILE
హైదరాబాద్ నడిబొడ్డున సమైక్యాంధ్ర శంఖారావం సభ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. జగన్ హైదరాబాద్ సభపై హరీష్ రావు మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ గనుక నగరంలో సమైక్య శంఖారావం అంటూ సభలు, సమావేశాలు నిర్వహిస్తే సహించేదిలేదు. మళ్లీ మానుకోట ఘటన పునరావృతమవుతుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఓపికను, సహనాన్ని అలుసుగా తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన మందలించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో వైసీపీ జెండా అనేది లేకుండా చేస్తామన్నారు.

తెలంగాణకు కూడా న్యాయం చేస్తామని వైఎస్.జగన్ అనడంపై హరీష్‌రావు మండిపడ్డారు. తెలంగాణలోని గనులను పంచడమే సమన్యాయమా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసం జగన్ ఇరు ప్రాంతాల ప్రజలకు గాలం వేస్తున్నాడని ఆరోపించారు. జగన్‌కు సీఎం పదవిపై మోజు ఉందని విమర్శించారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి చనిపోయినపుడు సీఎం పదవి కోసం జగన్ పడిన ఆరాటాన్ని ప్రజలు చూశారని అన్నారు.

పచ్చి అవకాశ వాదం, దోపిడి జగన్ నైజమని దుయ్యబట్టారు. రాష్ట్రం విడిపోతే లోటస్‌పాండ్ దయ్యాల కొంప అవుతుందనే జగన్ బాధ అని తెలిపారు. జగన్‌కు రాజకీయాలు చేయాలనుంటే సీమాంధ్రకు వెళ్లిపోవాలని హితవుపలికారు. కానీ ఇక్కడ ఉండి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని హరీష్ రావు హెచ్చరించారు.

తమ హెచ్చరికలను కాదని హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ సమైక్య శంఖారావం సభను నిర్వహించేందుకు పూనుకుంటే మాత్రం సభను అడ్డుకుని తీరుతామన్నారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన జగన్ నీతి, నిజాయతీ అంటుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తరహాలోనే జగన్ కూడా ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందేనని హరీశ్ జోస్యం చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu