విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) శత జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మహాకవి శ్రీశ్రీ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య "శ్రీశ్రీ ప్రస్థానత్రయం" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక తొలి ప్రతిని రోశయ్య ఆవిష్కరించగా, శ్రీశ్రీ సతీమణి సరోజా శ్రీశ్రీ స్వీకరించారు.
ఇప్పటికే శ్రీశ్రీ సాహిత్యం అనేక సంపుటాలుగా వెలుగులోకి రాగా.. తాజాగా మనసు ఫౌండేషన్ ఆయన సాహిత్యాన్ని మూడు భాగాలుగా విభజించి "శ్రీశ్రీ ప్రస్థానత్రయం"గా ప్రచురించింది.
"శ్రీశ్రీ ప్రస్థానత్రయం" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య మాట్లాడుతూ.. శ్రీశ్రీపై ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీశ్రీ సాహిత్యం ప్రజాజీవనంలో భాగమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ఇదే కార్యక్రమంలో శ్రీశ్రీ స్వయంగా చదివిన మహాప్రస్థానం గేయాలు, శ్రీశ్రీ ఉపన్యాసాలతో పాటు ఎంపిక చేసిన సినిమా పాటల సీడీనీ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆవిష్కరించారు.