కేసీఆర్ ఓ వేస్ట్ ఫెలో ..ఆయన మాటలు నమ్మొద్దు : రేణుకా
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2012 (09:19 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు ఒక వేస్ట్ ఫెలో అని.. ఆయన మాటలను ఎవరూ నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని ఆయన, ఆయన కుటుంబం కోట్లాది రూపాయలకు పడగలెత్తారని ఆమె ఆరోపించారు. తెలంగాణపై ఈనెలాఖరు నాటికి కేంద్రం ఒక ప్రకటన చేస్తుందంటూ కేసీఆర్ ప్రకటనలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. దీనిపై రేణుక చౌదరి ఘాటుగా స్పందించారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బెదిరింపులకు తమ పార్టీ అధిష్టానం తలొగ్గబోదన్నారు. గత పదేళ్లుగా చెపుతున్న మాటలనే కేసీఆర్ పదేపదే వల్లె వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణపై అనేక మార్లు డెడ్‌లైన్లు విధించిన కేసీఆర్.. తాజాగా సెప్టెంబరు నెలాఖరును మరో డెడ్‌లైన్‌గా విధించి, ఢిల్లీలో తిష్టవేసి హడావుడి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇకపోతే... వచ్చే నెల ఒకటో తేదీన నిర్వహించనున్న జీవ వైవిధ్య సదస్సు కోసం దాదాపు రూ.450 కోట్లు వ్యయం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ సదస్సులో ప్రపంచదేశాలన్నీ పాల్గొననున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సదస్సును విజయవంతంగా చేయాలని రేణుకా చౌదరి విజ్ఞప్తి చేశారు.