Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేటీఆర్ ఓ అచ్చోసిన ఆంబోతు: నిర్మాత కాట్రగడ్డ ధ్వజం

Advertiesment
కేటీఆర్
WD
WD
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కే.తారక రామారావు (కేటీఆర్) ఒక అచ్చోసిన ఆంబోతులా హైదరాబాద్‌లో తిరుగుతున్నాడని ప్రముఖ సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఆరోపించారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో ఆదివార సాయంత్రం ప్రవాసాంధ్రుల సమైక్యాంధ్ర శంఖారావం కార్యక్రమం జరిగింది.

ఇందులో పాల్గొన్న కాట్రగట్ట ప్రసాద్ ప్రసంగిస్తూ.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల తీరుపై మండిపడ్డారు. అమెరికాలో చదువుకుంటూ వచ్చిన కేటీఆర్‌ను కేసీఆర్ రాష్ట్రానికి తీసుకొచ్చి అచ్చోసిన ఆంబోతులా వదిలిపెట్టారన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని హైదరాబాద్‌ నగరంలో స్థిరపడిన సినీ ప్రముఖులు, పెట్టుబడిదారుల నుంచి అడ్డుగోలుగా వసూళ్లు చేస్తూ కోట్లు అర్జిస్తున్నారని ఆరోపించారు. మాటకుముందు.. రాజీనామాల పేరుతో ప్రజలను మోసం చేయడమే కాకుడా, ఎన్నికల పేరుతో కోట్టు దండుకుంటున్నారన్నారు.

ఎలాగో ఎన్నికల్లో గెలుస్తామని తెలిసినప్పటికీ.. వసూళ్లే ప్రధానంగా ఆయనకేసీఆర్ అండ్ ఫ్యామిలీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వారికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలన్నారు. ఇపుడు తాజాగా మిలీనియం మార్చ్ పేరుతో ఛలో హైదరాబాద్ చేపట్టాలని భావిస్తున్నారన్నారు.

వాస్తవానికి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు తమ వెంట ఉన్నారని చెప్పుకునే కేసీఆర్.. ఆయన కాలికింద చెప్పులా వ్యవహరిస్తున్న తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌లు పది లక్షల మందితో మిలీనియం మార్చ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు.

ఈ మార్చ్‌లో పది లక్షల మంది ప్రజలేనా పాల్గొనేది.. అంతకుమించి పాల్గొనరా అని కాట్రగడ్డ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతాన్ని సీమాంధ్రులు దోచుకుంటున్నారని పదేపదే ఆరోపిస్తున్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన సినీ నటులు రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడులు చిత్ర పరిశ్రమలో సంపాదించిన ప్రతి రూపాయి ఎక్కడ పెట్టారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. వీరందరినీ హైదరాబాద్ విడిచి పోమ్మంటే ఎక్కడకు వెళతారన్నారు.

ఇకపోతే.. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న అమెరికాకు చెందిన ప్రసాంద్రుడు కావూరి లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచదేశాలన్నీ భారత్‌ వైపు చూస్తుంటే, కొందరు స్వార్ధపూరిత నేతలు మాత్రం దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు సిమెంట్స్ కార్పొరేషన్ డైరక్టర్ జీఏ.రాజ్‌కుమార్ మాట్లాడుతూ తెలుగువాడి హృదయం చాలా విశాలమైనదని, అందరితోనూ కలసి బతకాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ పోతాడని కొనియాడారు. అటువంటి తెలుగు జాతిని విడగొట్టాలంటూ ఉద్యమాలు చేపట్టడం మామూలైపోయిందన్నారు.

ఒక్క ఆంధ్రరాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వేర్పాటు ధోరణులు కనిపిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. భాషాప్రయుక్త ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్ర అవతరణ సాధించి పొట్టిశ్రీరాములు అమరజీవి అయ్యారని, తెలుగు ప్రజలందరికీ ఒక రాష్ట్రం కావాలని ఆ మహానుభావుడు కోరుకుంటే, ప్రస్తుతం రెండు ముక్కలు చేయాలనడం దురదృష్టకరమన్నారు.

అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సీఎంకే రెడ్డి, సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్, ప్రొఫెసర్ ఎన్.శామ్యూల్, సమైక్యాంధ్ర బలహీనవర్గాల జేఏసీ కన్వీనర్ వైవి.సురేష్, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర కార్యదర్శి తంగుటూరి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నేత జెట్టి మోహనరావులు తదితరులు పాల్గొని సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రసంగించారు.

Share this Story:

Follow Webdunia telugu