కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్‌నాయకుడు గింజుపల్లి వీరయ్యచౌదరిని సోమవారం ఉదయం ఆయన ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు.
స్థానికంగానున్న శివాలయంలో పడివున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నెలరోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు ఆలూరి బుచ్చయ్య చౌదరి అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు.
చౌదరి హత్యకేసులో వీరయ్య ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రతీకారంగానే ప్రత్యర్థులు వీరయ్యను హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాగా వీరయ్య హత్యకు నిరసనగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు రాస్తారోకు నిర్వహించారు.