దేశంలోని మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఓ శుభవార్త చెప్పింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొన్ని దశబాద్దాలుగా ఆటకెక్కివున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షం కల్పిస్తామని హామీ ఇచ్చింది.
నిజానికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తయారు చేసిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు గత 2010 మార్చి 9వ తేదీన రాజ్యసభ ఆమోదముద్రవేసింది. కానీ, లోక్‌సభలో మాత్రం చర్చకు రాకుండానే ఆగిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన యూపీఏ-2 ప్రభుత్వం లేదా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు కూడా ఈ బిల్లు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నిక సమయం సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు అస్త్రాన్ని ప్రయోగించింది. అధికారంలోకి రాగానే 33 శాతం మహిళా బిల్లకు మోక్షం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇదే అంశంపై ఆ పార్టీ యువ నేత జ్యోతిరాదిత్య సింథియా మాట్లాడుతూ, తాము అధికారంలోకి వస్తే పార్లమెంట్ తొలి సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తామని ప్రకటించారు.
యూపీఏ ఛైర్‌పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు తామంతా మహిళా పక్షపాతులమని వ్యాఖ్యానించారు. ఈ మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపితే పార్లమెంట్‌లో మహిళా లోక్‌సభ సభ్యుల సంఖ్య 170కు చేరుతుందని, వారిలో తమ భార్య ప్రియదర్శిని రాజ సింథియా కూడా ఒకరుగా ఉంటారని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.