బాలీవుడ్‌నటుడు అనుపమ్ ఖేర్ వీసా వివాదానికి తెరపడింది. కరాచీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుపమ్‌ఖేర్ పాకిస్థాన్ వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారు. పాక్ అధికారులు అనుపమ్‌కు వీసా ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో వీసా వివాదం పెద్ద దుమారం రేపింది. దీనిపై స్పందించిన పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్... వీసా కోసం అనుపమ్‌ఖేర్ దరఖాస్తు చేసుకోవాలని, వీసా మంజూరు చేస్తామని చెప్పారు. వీసా మంజూరు చేసేందుకు అంగీకరించిన పాక్ హైకమిషనర్‌కు అనుపమ్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం కరాచీలో తన కార్యక్రమం ముగిసిందని, ఇపుడు తనకు వీసా అవసరం లేదని చెప్పారు. పైగా ఆ రోజుల్లో వేరే పనులు పెట్టుకున్నానంటూ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు పాక్‌లోని కరాచీ నగరంలో సాహిత్య సమ్మేళనం జరగనుంది. దానికి అనుపమ్ ఖేర్‌ను ప్రత్యేక అతిథిగా నిర్వాహకులు ఆహ్వానించారు.
అయితే ఆ కార్యక్రమానికి భారత్ నుంచి వెళ్లనున్న 18 మందిలో అనుపమ్ ఖేర్ ఒక్కరికే వీసా రాలేదు. పాక్ హోం శాఖ అభ్యంతరాలవల్లే తన వీసా ఆగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. మన దేశంలో పాక్ హై కమిషనర్ దానిపై స్పందించారు. అనుపమ్ ఖేర్ మళ్లీ దరఖాస్తు చేసుకుంటే కొద్ది గంటలలోనే వీసా ఇప్పిస్తామని చెప్పారు.