వాటర్ గ్రిడ్ పైప్ లైన్ల కోసం రూపొందించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. పరిశ్రమలు, పట్టణ, గ్రామ, నివాసాలకు తాగునీటి అవసరాల కోసం పైపులు వేయడానికి, భూ వినియోగదారుల హక్కును పొందడానికి ఉద్దేశించిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీలో ఆమోద ముద్ర వేశారు.
ఈ బిల్లును కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కేంద్ర భూసేకరణ చట్టం ప్రకారం.. ఆ పైపులైన్లకు అవసరమైన భూమిని సేకరించాలని డిమాండ్ చేశాయి. దీనిపై పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ సమాధానానికి సంతృప్తి చెందని విపక్షాలు.. సభ నుంచి వాకౌట్ చేశాయి.
ఎంఐఎం మినహా విపక్షాలు సభలో లేకుండానే ఈ బిల్లుకు సభలో ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బుధవారం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దానిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉంది’’ అని ప్రకటించారు. భూమిని సేకరించడం కాకుండా.. వినియోగ హక్కును మాత్రమే పొందుతూ చట్టం చేయడం సరికాదన్నారు.
ఇలా వినియోగ హక్కును పొందిన భూమిలో భవనాలు, కట్టడాలు నిర్మించకూడదని.. చెరువులు, బావులు తవ్వకూడదని, చెట్లు పెంచరాదని నిబంధనలు పెట్టారని వివరించారు. అలాకాక.. ఆ భూములను పూర్తిగా సేకరించవచ్చుగదా? అని ప్రశ్నించారు.
భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరిస్తామంటూ.. తామూ సూచించిన సవరణపెట్టి బిల్లును సభలో పెట్టాలన్నారు. ఈ బిల్లుపై పునరాలోచన చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత కె. లక్ష్మణ్ సూచించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపి అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ.. వాటర్‌గ్రిడ్ పైపులైను ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, పేద వర్గాల భూముల నుంచే వెళుతుందన్నారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య సూచించారు. అనంతరం పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పైపులైన్ల వల్ల ఎక్కడా రైతుల జీవనోపాధికి అంతరం కలగకూడదని, వారికి భూమిని శాశ్వతంగా దూరం చేయకూడదనే వినియోగహక్కును పొందే ఈ బిల్లును తెచ్చామని చెప్పారు.
రెండు మీటర్ల కంటే ఎక్కువ లోతును తవ్వి పైపు లైన్లను వేస్తున్నామని, దీంతో వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది ఉండబోదన్నారు. పైపు లైన్ల నిర్మాణం సమయంలో స్టాండింగ్ క్రాప్స్‌కు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. భూసేకరణకు పోతే గతంలో ఎన్ని పోరాటాలు వచ్చాయో, ఎంత జాప్యం జరిగిందో చూడాలన్నారు. ప్రైవేటు భూములను వినియోగించుకుంటామని వివరించారు.