హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఎస్టీ(లంబాడా) దంపతులకు హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు మంజూరు చేయవచ్చని ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నందున హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 2(2)ను మినహాయించవచ్చంది. ఈ సెక్షన్ ప్రకారం ఎస్టీలకు హిందూ వివాహ చట్టం వర్తింపజేయాలంటే కేంద్రం నోటిఫై చేయాల్సి ఉంటుందని, పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగినందున కేంద్రం నోటిఫై చేయకపోయినా ఇదే చట్టం కింద విడాకులు మంజూరు చేయవచ్చంది.
కామారెడ్డి జిల్లా నర్సులాబాద్ మండలం మైలారం తండాకు చెందిన ఎస్టీ యువతీ, యువకుడు గత 2019 మేలో పెళ్లి చేసుకున్నారు. ఏడాది కాపురం తర్వాత విభేదాలు తలెత్తాయి. పెద్దల ఒప్పందం ప్రకారం 2023లో విడిపోయారు. భార్యకు భర్త రూ.9 లక్షలు చెల్లించాలని, ఆభరణాలు ఎవరివి వారికి ఇచ్చేయాలని ఒప్పందం కుదిరింది. అనంతరం పరస్పర అంగీకారంతో విడాకుల నిమిత్తం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(బి) కింద కామారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.
అయితే చట్టంలోని సెక్షన్ 2(2) ప్రకారం కేంద్రం నోటిఫై చేయకుండా వర్తించదని, పిటిషన్ విచారణార్హం కాదని కోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ భర్త హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టి ఇటీవల తీర్పు ఇచ్చారు. పిటిషనర్ తరఫు న్యాయవాది టి.సృజన్‌కుమార్‌రెడ్డి, కోర్టు సహాయకుడు కె.పవన్‌కుమార్‌లు వాదనలు వినిపిస్తూ విడాకులు కోరుతున్న ఇద్దరూ లంబాడా వర్గంలోని మీనా తెగకు చెందిన వారన్నారు.
సప్తపదితో సహా హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నారన్నారు. హిందూ చట్టాన్ని వారికి వర్తింపజేయని పక్షంలో ఈ తెగలోని మహిళలకు అన్యాయం జరుగుతుందని, బహుభార్యత్వం అమలవుతుందన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి... గుర్తించిన తెగల ఆచార, సంప్రదాయాలను రక్షించడానికే హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 2(2)ను అమలు చేయాల్సి ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టు, ఢిల్లీ, ఏపీ హైకోర్టులు తీర్పులు ఇచ్చాయన్నారు. ఇక్కడ హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి జరిగినందున, హిందూ వివాహ చట్టం కింద విడాకులు మంజూరు చేయాలంటూ కింది కోర్టును ఆదేశించారు. ఆయా కేసుల్లోని పరిస్థితుల ఆధారంగా కింది కోర్టులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టతనిచ్చారు.