Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ క్రికెటర్లు క్రీడాస్ఫూర్తిని పాతిపెట్టారు!

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ క్రికెటర్లు క్రీడాస్ఫూర్తిని పాతిపెట్టారు!
FILE
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ క్రికెటర్లు క్రీడాస్ఫూర్తిని పాతిపెట్టారని ఆస్ట్రేలియా మీడియా ధ్వజమెత్తింది. ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ చివరి టెస్టులో జీవం నింపేందుకు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినప్పటికీ, అతనిని హేళన చేయడం ఇంగ్లాండ్ ప్రేక్షకుల అనుచిత వైఖరికి అద్దం పడుతుందని విరుచుకుపడింది.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను అప్పటికే ఇంగ్లాండ్ 3-0 తేడాతో కైవసం చేసుకున్న నేపథ్యంలో, చివరిదైన ఐదో టెస్టుకు ఎలాంటి ప్రాధాన్యం లేకపోయింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లకు 492 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.

వాట్సన్ 176, స్టీవెన్ స్మిత్ 138 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ 95 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 377 పరుగులకే ఆలౌటైంది.

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్లకు 111 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, ఇంగ్లాండ్ ముందు 227 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనిని ఛేదించడానికి చివరి రోజున ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ విపరీతంగా శ్రమించారు.

విజయానికి 24 బంతుల్లో 21 పరుగులు అవసరమయ్యే సమయానికి ఇంగ్లాండ్ ఐదు వికెట్లకు 206 పరుగులు చేసింది. ఈ దశలో వెలుతురు సరిగ్గా లేని కారణంగా ఆటను రద్దు చేసిన ఫీల్డ్ అంపైర్లు అలీం దార్, కుమార ధర్మసేన ఈ మ్యాచ్‌ని డ్రాగా ప్రకటించారు.

అయితే, అంతకు ముందే బాడ్‌లైట్ సమస్య తలెత్తిందని, ఫ్లడ్‌లైట్లు వేసినా మైదానంలో బంతి సరిగ్గా కనిపించలేదని ఆసీస్ కెప్టెన్ క్లార్క్ వాదించిన విషయాన్ని ఆస్ట్రేలియా మీడియా ప్రస్తావించింది. ఆటను నిలిపివేయాలని క్లార్క్ కోరినప్పటికీ అంపైర్లు ఉద్దేశపూర్వకంగానే కొనసాగించారని, ఇంగ్లాండ్‌ను గెలిపించడమే వారి ధ్యేయంగా కనిపించిందని ఆరోపించింది.

గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఆటను నిలిపేశారని, ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంగ్లాండ్‌ను గెలిపించేందుకు అంపైర్లు ప్రయత్నించేవారని ఆసీస్ మీడియా విమర్శించింది.

Share this Story:

Follow Webdunia telugu