'టీమ్ ఇండియా' కెప్టెన్ ఎంపికలో గత నాలుగు రోజులుగా సాగుతున్న చర్చకు మంగళవారం తెరపడింది. 'ది వాల్' రాహుల్ ద్రావిడ్ వారసునిగా 'యంగ్ డైనమెట్' మహేంద్ర సింగ్ ధోనీని జాతీయ సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించే జట్టులో తొలి మూడు వన్డేలకు ధోనీని కెప్టెన్‌గా కొనసాగుతాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో పాల్గొన్న భారత జట్టుకు ధోనీ నాయకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో మంగళవారం ముంబైలో సమావేశమైన బీసీసీఐ జాతీయ సెలక్టర్లు ధోనీని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. 26 సంవత్సరాలు 73 రోజుల వయస్సు కలిగిన ధోనీ.. కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్. గత 2004లో బెంగుళూరులో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ ప్రవేశం చేసిన ధోనీ.. ఇప్పటి వరకు మొత్తం 84 వన్డే మ్యాచ్‌లు ఆడి, 44.23 సగటుతో 2477 పరుగులు చేశాడు.
ధోనీ గతంలో జార్ఖండ్, ఆసియా లెవన్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. దేశంలోనే బాగా వెనుకబడిన రాష్ట్రమైన జార్ఖండ్ రాష్ట్రం నుంచి చిన్న వయస్సులో భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన ఆటగానిగా ఎంఎస్ ధోనీ రికార్డు సృష్టించాడు.