Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాగరతీర అందాలతో అలరారుతున్న పద్మనాభుడు!

సాగరతీర అందాలతో అలరారుతున్న పద్మనాభుడు!
, సోమవారం, 25 జులై 2011 (16:42 IST)
FILE
అనంత పద్మనాభ స్వామి అంటేనే తిరువనంతపురంలోని భారీ నిధి నిక్షేపాలు కలిగిన అనంత పద్మనాభుడే గుర్తుకొస్తుంది. ఇప్పటికే తిరువనంతపురంలోని పద్మనాభుని ఆలయంలో భారీ సంపద బయటపడ్డాయి. స్వామి వారి నేలమాళిగల్లో భారీ సంపద వెలుగులోకి వచ్చింది. అయితే ఆరో నేల మాళిగను మాత్రం అధికారులు తెరెచేందుకు వెనుకంజ వేస్తున్నారు.

ఆరో నేల మాళిగకు సముద్రానికి లింక్ ఉండటంతో పాటు ఆరో నేల మాళిగ తలుపులకు నాగబంధం ఉండటం వంటి కారణాలతో దానిని తెరిచేందుకు అధికారులు ముందుకు రావడం లేదు. అలాగే ఆరో నేల మాళిగ తలుపులకు నాగబంధం ఉండటంతో ప్రత్యేక పూజలు చేయాల్సిన అవసరం ఉందని, దానిని తెరిస్తే అరిష్టమని పండితులు హెచ్చరించడంతో సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చేంతవరకు ఆ నేలమాళిగను తెరవద్దని ఖరాఖండిగా చెప్పేసింది.

ఇక తిరువనంతపురం పద్మనాభుని సంగతి అటుంచి రాష్ట్రంలోని పద్మనాభుని ఆలయం గురించి కాస్త తెలుసుకుందాం. సహజ సిద్ధమైన సాగరతీర అందాలతో అలరారుతూ.. విశాఖపట్టణానికి 50 కిలో మీటర్ల దూరంలో రేవడి పద్మనాభం అనే గ్రామంలో ఉన్న కొండపై అనంత పద్మనాభుడు కొలువై, తన భక్తులకు కరుణాపూరితుడుగా భాసిల్లుతున్నాడు.

ఈ కొండకు దిగువన కుంతి మాధవస్వామి ఆలయం ఉంది. ఈ రెండు ఆలయాల గురించి పురాణ ప్రసిద్ధమైన స్థలపురాణాలున్నాయి. మహాభారత సమయంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుని ప్రార్థించి, తమకు కర్తవ్య బోధ చేయమని ప్రార్థించారు. అప్పుడు భగవానుడు తాను పద్మనాభుని అంశంతో కొలువై కర్తవ్య బోధ చేస్తానని, ఇక్కడ వ్యక్తావ్యక్తరూపంలో కొలువైనట్లు స్థలపురాణం చెబుతోంది.

అలాగే కొండ దిగువన ఉన్న కుంతి మాధవ స్వామి ఆలయానికి సంబంధించి ఓ స్థలపురాణం ఉంది. కుంతీ దేవి ఇక్కడ మాధవుని విగ్రహ ప్రతిష్ట చేసినందువల్ల స్వామికి కుంతీమాధవస్వామి అనే పేరు వచ్చినట్లు చెబుతారు. భక్తులు ముందుగా కుంతీ మాధవస్వామిని దర్శించుకుని, అనంతరం కొండపైనున్న అనంత పద్మనాభస్వామిని దర్శించుకుంటారు. ఇది అనాదిగా కొనసాగుతున్న ఆచారం.

అనంతపద్మనాభునికి వ్యక్తావ్యక్తరూపం, స్వయంభువు. ఆదిశేషునిపై పద్మనాభుడు శంఖు చక్రధారియై, లక్ష్మీదేవి సహితంగా కొలువైయ్యాడు. ఈ విశేషాలన్నీ అవ్యక్తంగా ఉంటాయి. స్వామివారి ఆలయంలో అనంత చతుర్దశిని వైభవంగా చేస్తుంటారు. ఈ కొండపైకి చేరుకోవాలంటే మొత్తం 1278 మెట్లను ఎక్కాలి.

దారిలో 423 మెట్లు వద్ద, 850 మెట్టు వద్ద విశ్రాంతి పందిళ్ళున్నాయి. కొండపై నుంచి చూస్తున్నప్పుడు, చుట్టుపక్కలనున్న పచ్చని ప్రకృతి సౌందర్యం మనసులను ఆహ్లాద పరుస్తుంటుంది. రేవిడి పద్మనాభం గ్రామం చేరుకునేందుకు విశాఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేవిడి పద్మనాభ గ్రామానికి చేరుకోవచ్చు. బస్సు సౌకర్యం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu