Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదట!

మహాశివరాత్రి రోజున జాగారం చేస్తే పునర్జన్మంటూ ఉండదట!
, మంగళవారం, 15 ఫిబ్రవరి 2011 (17:37 IST)
FILE
శివుడికి సంబంధించిన పండుగలన్నింటినిలోనూ ముఖ్యమైనది, పుణ్యప్రదమైనది మహాశివరాత్రి. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి (మార్చి-2) అని పేరు. శివరాత్రి పండుగను జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు ఉన్నాయి.

శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి.

శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేయడం మాత్రమే. కానీ ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు తెలియజేస్తోంది.

మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు-నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది.

శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతూనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తునో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాధలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

పూర్వం గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోకి వెళ్లాడు. నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్నీ పిండి వంటలనూ కాజేద్దామనుకున్నాడు. తెల్లవార్లూ కునుకులేకుండానే ఉన్నాడు. దీప జ్వాల కొండెక్కుతుంటే వత్తిని ఎగదోశాడు. ఉత్తరీయం అంచును చించి, దారపు పోగులను వత్తిగా చేసి, ఆవునెయ్యిపోసి వెలిగించాడు.

ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి, పరిగెత్తుతూ తలారి వేసిన బాణపు దెబ్బవల్ల మరణించాడు. ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతియైన అరిందముడికి దముడు అనే కుమారుడిగా జన్మించాడు.

ఆ జన్మలో మహారాజై, అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి, ఆ పుణ్యం వలన ఆ పై జన్మలో కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు. ఇలా పరమేశ్వరుడికే ప్రాణసఖుడైనాడని పురణాలు చెబుతున్నాయి. అందుచేత మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాల్ని పొందుదాం..!!

Share this Story:

Follow Webdunia telugu