Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరద బాధితులను ఆదుకుందాం రండి.. : తానా, ఆటా

వరద బాధితులను ఆదుకుందాం రండి.. : తానా, ఆటా
FILE
జలప్రళయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెను విపత్తు వాటిల్లిన నేపథ్యంలో.. వరద బాధితులను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా)లు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో వరద సృష్టించిన బీభత్సం, కన్నీటి కడగండ్లను మీడియా ద్వారా తెలుసుకున్న తాము బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చామనీ.. అలాగే ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులందరూ తగిన చేయూతనివ్వాలని ఈ సందర్భంగా తానా, ఆటా ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు కోమటి జయరాం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకునేందుకు తాము ఉన్నామన్న ధైర్యాన్ని తానా కల్పిస్తోందన్నారు. వరదల ధాటికి నిరాశ్రయులైన వేలాదిమందికి చేయూత నిచ్చేందుకు, ఈ విపత్కర సమయంలో అండగా నిలిచేందుకు తెలుగు సంఘాలు, చారిటబుల్ సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

అదే విధంగా ఆటా ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు తీరని శోకాన్ని మిగిల్చిన ఈ విపత్తు నుంచి గట్టెక్కించేందుకు "ఆటా" విరాళాల సేకరణకు నడుం బిగించిందని తెలిపారు. అలాగే వరద బాధితులను ఆదుకునేందుకు తమకు చేతనైనంత సహాయం అందించాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకాన్ని ఆటా ఈ మేరకు అభ్యర్థించింది.

గతంలో చేపట్టిన పలు విరాళ సేకరణ కార్యక్రమాల్లో పలువురు ప్రవాసాంధ్రులు విశేషంగా పాల్గొని "ఆటా"కు మద్ధతుగా నిలిచారనీ.. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించి బాధితులకు తమ ఆపన్న హస్తాన్ని అందించగలరని తాము ఆకాంక్షిస్తున్నట్లు.. ఆటా ప్రతినిధులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తమ ప్రయత్నానికి మరింత తోడ్పాటునందించి బాధితులను ఆదుకోవాలని వారు మరోసారి ప్రవాసాంధ్రులను కోరారు.

Share this Story:

Follow Webdunia telugu