Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రవాస విద్యార్థుల కోసం "డేటా బ్యాంక్‌" ఏర్పాటు

ప్రవాస విద్యార్థుల కోసం
విదేశాల్లో ముఖ్యంగా ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు పెరిగిన నేపథ్యంలో... వారి సంక్షేమం కోసం, రక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఓఐఏ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రవాస భారతీయుల సమాచారాన్ని తెలియజేసే కేంద్రాన్ని (డేటా బ్యాంక్‌)ను ఏర్పాటు చేసేందుకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది.

ఈ సందర్భంగా ఎంఓఐఏ మంత్రి వాయలార్ రవి మాట్లాడుతూ... విదేశాల్లోని భారతీయ విద్యార్థుల రక్షణకు ఈ డేటా బ్యాంకు ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ, విదేశాంగశాఖల సహకారంతో ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టువల్ల ఏడాదిలో విదేశాలకు వెళ్లే మన విద్యార్థుల సంఖ్య, వారు చదివే విద్యా సంస్థల వివరాలను క్షుణ్ణంగా తెలుసుకోవచ్చన్నారు.

విద్యార్థులు ఈ-మెయిల్ ద్వారా కూడా డేటా బ్యాంకులో తమ పేరును నమోదు చేసుకోవచ్చని వయలార్ రవి తెలిపారు. అలాగే ఎయిర్‌పోర్టుల్లోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద ఇచ్చే ఫారం ద్వారా కూడా పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఆస్ట్రేలియాలో చదువుతున్న భారతీయుల వివరాలను ఇవ్వమని తాము ఆ దేశ అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే కోరినట్లు మంత్రి చెప్పారు.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో సుమారు 97వేల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లుగా తెలుస్తోందన్నారు. విదేశీ విద్యార్థుల ప్రాణ రక్షణకు సంబంధించిన చట్టాలను కూడా సవరించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని తాము కోరినట్లు మంత్రి తెలియజేశారు.

ఇదిలా ఉంటే... ప్రవాస భారతీయులకు చెందిన గణాంకాలు ప్రభుత్వం వద్ద లేవని గమనించిన ఎంఓఐఏ శాఖ తొలి చర్యగా డేటాబ్యాంకు ఏర్పాటుకు పూనుకుంది. ఈ డేటా బ్యాంక్‌ రూపకల్పనకు విద్యార్థులతోనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వారు ఉంటున్న నగరం, నివాస ప్రాంతం, చదువుకొంటున్న కళాశాల లేదా విశ్వవిద్యాలయం పేరు, పనిచేసే ప్రాంతం తదితర వివరాలన్నింటినీ ఇందులో పొందుపర్చనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu