భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ మరోమారు ప్రధాని మన్మోహన్ సింగ్‌పై విమర్శల వర్షం గుప్పించారు. ప్రధాని ముమ్మాటికీ బలహీన ప్రధానేనంటూ విమర్శించారు. యూపీఏ-2 తొలి మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో ప్రధాని మన్మోహన్ సింగ్ కంటే సోనియా గాంధీ అధిక ప్రభావం చూపించారన్నారు.
గురువారం ఢిల్లీలో జరిగిన ఏక్తాయాత్రను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని కంటే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకే ఎక్కువ ప్రాధాన్యం ఉందని ఈ మంత్రివర్గ విస్తరణలో తేలిపోయిందన్నారు. మన్మోహన్ బలహీనమైన ప్రధాని అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారని వ్యాఖ్యానించారు.
మన్మోహన్ సింగ్ బలహీన ప్రధాని అని తాను 2009 ఎన్నికల ప్రచార సమయంలోనే చెప్పానని, ఇప్పుడు ఆ మాటతో అందరూ అంగీకరిస్తారని వ్యాఖ్యానించారు. మన్మోహన్ సింగ్‌ను తాను వ్యక్తిగతంగా గౌరవిస్తానని, ఆయనపై తన వ్యాఖ్య వ్యక్తిగతమైనది కాదని, కేవలం రాజకీయమైనదేనని వివరణ ఇచ్చుకున్నారు.
విదేశాల్లో భారతీయు నల్లధనం గురించి 2009లో తాను ప్రస్తావిస్తే, బాధ్యతా రహితమైన ఆరోపణలంటూ ప్రధాని కొట్టిపారేశారని, నల్లధనం విదేశాల్లో నిల్వ చేసుకోవడం దేశ సంపదను కొల్లగొట్టడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని అద్వానీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.