2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సిబిఐ జరుపుతున్న దర్యాప్తు వల్ల ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోను డిఎంకే-కాంగ్రెస్ కూటమికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, తమ మైత్రి అలానే కొనసాగుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అన్నారు.
ఈ కేసుకు సంబంధించి తమిళనాడు, న్యూఢిల్లీల్లోని మాజీ టెలికాం మంత్రి ఎ రాజా, కార్పొరేట్ లాబీయిస్ట్ నీరారాడియా మరియు పలువురు నివాసాలు, కార్యాలయాలపై బుధవారం సిబిఐ సోదాలు నిర్వహించడంతో కనిమోళి పాత్ర వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో కనిమోళి స్పందిస్తూ.. ‘చట్టం తన పని తాను చేసుకుపోవాలి. ఇది మేము తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రక్రియ, మేము తప్పకుండా మా నిజాయితీని రుజువు చేసుకుంటామ’ని అన్నారు.
సిబిఐ చేస్తున్న దర్యాప్తును స్వాగతిస్తున్నామని, స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి 2001 నుండి విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు పేర్కొనడం శుభపరిణామమని, దీని వ్లల నిజమైన దోషులు బయటకు వస్తారని ఆమె తెలిపారు. కాగా.. ఈ పరిణామాలు కాంగ్రెస్‌తో మీ పార్టీ సంబంధాలను దెబ్బ తీసాయా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కనిమోళి సమాధానమిస్తూ.. ‘మా సంబంధాలు ఏమాత్రం దెబ్బ తినలేదు.. ఎలాంటి తప్పూ జరలేదని మేము నిరూపించుకుంటామని నాకు గట్టి నమ్మకం ఉంద’ని చెప్పారు.