కాంగ్రెస్ అవినీతి పాలనకు వ్యతిరేకంగా భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించాలని, ఈ మేరకు అఖిలపక్ష పార్టీలు పాల్గొనాలని నేషనల్ డెమోక్రటిక్ పార్టీ (ఎన్డీఏ) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ ర్యాలీలో బిజు జనతా దళ్ (బిజెడి) పాల్గొంటుందా లేదా అన్న సందేహానికి తెరదించుతూ.. ఒడిషా (గతంలో ఒరిస్సా) ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓ ప్రకటన చేశారు.
భారతీయ జనతా పార్టీ పాల్గొనే ఈ ర్యాలీలో తాము పాల్గొనబోమని ఆయన చెప్పారు. "నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ఢిల్లీలో జరగబోయే ఆ (ఎన్డీఏ) ర్యాలీకు బిజెడి హాజరు కావడం లేద"ని ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ అన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై జెపిసి విచారణ వేయకుండానే పార్లమెంటు సమావేశాలను ముగించిన కేంద్ర ప్రభుత్వ అవినీతి విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 22న అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఎన్డీఏ భారీ బహిరంగ ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
"ఇది ఎన్డీఏ ర్యాలీ కాదు. ఇది మొత్తం విపక్షాల ర్యాలీ. డిసెంబర్ 22న ఢిల్లీలో మేము ఈ ర్యాలీ నిర్వహిస్తాం. దేశంలో జరుగుతున్న అవినీతిపై పోరాడేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయ"ని జెడి-యు ఛీఫ్ శరద్ యాదవ్ తెలిపారు. ధరల పెరుగుదలపై గత జులై 5న అన్ని విపక్ష పార్టీలు కలిసి భారత్ బంధ్‌కు పిలుపునిచ్చినట్లుగానే ఈ ర్యాలీ కూడా జరుగుతుందని ఎన్డీఏ ఆశాభావంతో ఉంది.