లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వంటి నేతలను తిరిగి సీపీఎం పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ సీనియర్ నేత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య వ్యక్తిగత ప్రయత్నాలు చేపట్టారు. సొంత మార్గాలలో సోమనాథ్ వంటి నేతలను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు బుద్ధదేవ్ ఆదివారం వెల్లడించారు.
సోమనాథ్ పార్టీకి దూరమవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓ స్థానిక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుద్ధదేవ్ మాట్లాడుతూ.. సోమనాథ్ వంటి నేతలను దూరం చేసుకోవడం తమను బాధిస్తోందని చెప్పారు. సీపీఎం ఏడాది క్రితం పార్టీ నుంచి సోమనాథ్ చటర్జీ, మాజీ ఎంపీ సైపుద్దీన్ చౌదరీలను బహిష్కరించిన సంగతి తెలిసిందే.
వీరిద్దరినీ పార్టీలోకి తిరిగి తేవడం సాధ్యపడుతుందా అని అడిగిన ప్రశ్నకు బుద్ధదేవ్ సమాధానమిస్తూ.. ఎవరూ ఒంటిరిగా పార్టీని తయారు చేయలేరు. అనేక మంది వ్యక్తుల కలయికే పార్టీ. తాను ఇంతవరకు చెప్పగలను. వారిని తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు వ్యక్తిగత ప్రయత్నాలు చేపట్టినట్లు తెలిపారు.
ఇద్దరు నేతలను తిరిగి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా లేదా చటర్జీని మాత్రమే తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు తాను స్పష్టంగా ఏమీ చెప్పలేనన్నారు. తన సహచరులతో ఢిల్లీ, కోల్‌కతాలలో ఈ విషయంపై మాట్లాడానని బుద్ధదేవ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పార్టీ ఫర్ డెమొక్రటిక్ సోషలిజం (పీడీఎస్)ను స్థాపించిన చౌదరి తాను తిరిగి సీపీఎంలో చేరడంపై తనను ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు.