దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన మారణహోమం సూత్రధారులు పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులేనని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ఉగ్రవాద దాడుల వ్యూహకర్తలపై పాకిస్థాన్ చర్య తీసుకోవడంలో పూర్తిగా విఫలమైనందని ఆరోపించారు.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన మెల్‌బోర్న్‌లో మాట్లాడుతూ ప్రపంచంలో పాకిస్థాన్ ఉగ్రవాదానికి మూలకేంద్రంగా మారిందన్నారు. మనదేశానికి సంబంధించినంత వరకు పాకిస్థాన్ కొన్ని విషయాలపై సున్నితంగా ఉండాల్సి ఉందన్నారు. ఇలాంటి వాటిలో ఉగ్రవాదం ఒకటని గుర్తు చేశారు.
ఇలాంటి ఉగ్రవాదులనే పాకిస్థాన్ ప్రోత్సహిస్తూ.. తమ దేశంపై దాడులు జరిపేలా ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ముంబైలో 26/11 దాడులకు పాల్పడ్డవారు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులేనని రూఢీ అయినప్పటికీ, ఒక్క ఉగ్రవాదిని కూడా ఆ దేశ ప్రభుత్వం శిక్షించలేకపోయిందని కృష్ణ వ్యాఖ్యానించారు.
ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అణిచివేసేందుకు నాటో దళాలు పోరాటం చేస్తున్నాయన్నారు. ఇందుకోసం పాకిస్థాన్ దళాల సాయం తీసుకోవడాన్ని కృష్ణ తప్పుబట్టారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాక్‌ను నాటో దళాలు చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు.