Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చం: నిరుపమా

Advertiesment
నేపాల్
నేపాల్ దేశ అంతర్గత వ్యవహారాల్లో భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోదని కేంద్ర విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు స్పష్టం చేశారు. ఈ అంశంపై నేపాల్ మావోయిస్టులు చేస్తున్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.

మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ఖాట్మండుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేపాల్ రాజకీయాల్లో తాము ఎటువంటి జోక్యం చేసుకోవడం లేదని పదేపదే చెపుతున్నప్పటికీ ఆదేశ మావోయిస్టులు మాత్రం నేపాల్ రాజకీయాల పగ్గాలు భారత్‌ చేతుల్లోనే ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ వార్తలకు నేపాల్ మీడియా అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రసారం చేస్తోందని విమర్శించారు.

అయితే, నేపాల్‌ రాజకీయాలు, శాంతి ప్రక్రియ కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆమె మూడు రోజుల అధికార పర్యటన నిమిత్తం ఖాట్మండ్‌కు చేరుకోవడం చర్చనీయాంశమైంది. దీంతో ఆమె పర్యటనకు నేపాల్ మీడియా అధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీనిపై నిరుపమా రావు మీడియాతో మాట్లాడుతూ నేపాల్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు తాను ఇక్కడికి రాలేదని స్పష్టం చేశారు.

నేపాల్‌ ప్రగతి, శాంతి, సుస్థిరతకు దోహదపడే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ఇక్కడి రాజకీయ నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు భారత్‌ కట్టుబడి ఉన్నట్లు ఆమె పునరుద్ఘాటించారు. నేపాల్‌తో సత్సంబంధాల కొనసాగింపునకే భారత్‌ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu