పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత్రి బెనజీర్ భుట్టో హత్యకు ప్రధాన కారణభూతుడుగా భావిస్తున్న సైఫుల్లా అక్తర్ పంజాబ్ రాష్ట్రంలో స్వేచ్చగా విహరిస్తున్నట్టు పాక్ ఎలక్ట్రానిక్ మీడియా వార్తా కథనాలను ప్రసారం చేసింది. ఇది అధికార పార్టీలో పెను సంచలనం సృష్టించింది. గత 2007 డిసెంబర్‌లో బేనజీర్ భుట్టో స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆనందోత్సాహాలతో నిర్వహించిన ఒక ఊరేగింపులో ఆత్మాహుతి దాడి జరిపి ఆ తర్వాత ఆమెను కాల్చి చంపిన విషయం తెల్సిందే.
కరాచీలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 140 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ఆల్‌ఖైదాతో సంబంధం ఉన్న కమాండర్ ఖరీ సైఫుల్లా అక్తర్ కుట్రదారుడని ప్రాథమిక విచారణలో కూడా తేలింది. తాలిబన్ తీవ్రవాద సంస్థ హర్కతుల్లా జిహాద్ ఇస్లాం గ్రూపు సభ్యుడైన అక్తర్‌ను ఆగస్టు నుంచి పంజాబ్‌లోని చిస్తియన్ సబ్‌డివిజన్‌లో గృహనిర్భంధంలో ఉంచారు. ఈయనను ఈనెల మొదటివారంలో భద్రతా దళాలు విడుదల చేసినట్టు ఆ దేశ మీడియా పేర్కొంది.