Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీమాంధ్ర ప్రజలది సమైక్యవాదం... కానీ చిరు అలా... జేసీ ఇలా...

సీమాంధ్ర ప్రజలది సమైక్యవాదం... కానీ చిరు అలా... జేసీ ఇలా...
, సోమవారం, 26 ఆగస్టు 2013 (19:39 IST)
FILE
సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజల నుంచి సమైక్యాంధ్ర అనే నినాదం తప్పించి మరో మాట రావడంలేదు. వినిపించడం లేదు. అంతా కలిసే ఉండాలన్న మాటలు తప్పించి మరో మాటకు తావులేదని నినాదాలు చేస్తున్నారు. బ్యానర్లు, ఫ్లెక్సీలు, ప్లకార్డులు... అన్నీ జై సమైక్యాంధ్రప్రదేశ్ అనే నినాదాలు తప్ప వేరేమీ కనిపించడం లేదు. మరి ఈ విషయం మన నాయకులకు కనబడుతున్నట్లుగా లేదా...? అనే ప్రశ్నలు ఇపుడు మనం సంధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఏంటి సంగతి... అంటే, ఒకవైపు సీమాంధ్ర ప్రజలు సమైక్యం అంటుంటే ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధుల్లో కొంతమంది తమదైన శైలిలో డిఫరెంట్ సెటైర్లు వేస్తున్నారు. కేంద్రమంత్రివర్యులు చిరంజీవి, సమన్యాయం జరగాలంటే నీటి పంపకం గురించి ఆలోచన చేయాలంటూనే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేసి విడదీస్తే జనం అభ్యంతరపెట్టరంటూ సెలవిచ్చేశారు. జనం మాట ఇదేనని మెగాస్టార్ గట్టిగా నమ్ముతున్నారా...? జనం హైదరాబాద్ నగరాన్ని యూటీ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారని విశ్వసిస్తున్నారా...? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.

ఇక సీమ ప్రాంతానికి చెందిన కోట్ల సూర్యప్రకాశరెడ్డి రాయల తెలంగాణ ప్రతిపాదనను తెరపైకితెచ్చారు. ఇపుడు తాజాగా అదే పల్లవిని మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డి సైతం అందుకున్నారు. తనకు వంత పాట పాడేందుకు మరికొంతమంది ఉన్నారంటూ తాపీగా చెపుతున్నారు. సమైక్యాంధ్ర అనేది ఒక కల అనీ, దాని గురించి మర్చిపోవాలని సెలవిస్తున్నారు. అయితే సమైక్యాంధ్ర కావాలంటూ డిమాండ్ చేస్తున్న 13 జిల్లాల ప్రజల్లో ముందువరుసలో ఆ జిల్లా ప్రజలే ఉన్నారన్న విషయం సీనియర్ నేతగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డికి బోధపడినట్టు కనిపించడం లేదు.

మరి అనంత ప్రజలు రాయల తెలంగాణకు ఓకే అంటున్నారా...? మరి కడప, చిత్తూరు జనం సంగతేంటి..? జేసీ మాత్రం మాకు నీళ్లు, హైదరాబాద్ కావాలంటున్నారు... మరి మిగిలిన ప్రాంత వాసులకు అవి అవసరం లేదనుకుంటున్నారా....? అందుకేనేమో సమైక్య ఉద్యమం చేస్తున్న ప్రజలు, తాము నడుస్తున్న... నడుపుతున్న సమైక్య ఉద్యమంలోకి నాయకులను ఆహ్వానించడంలేదు. ఒకవేళ పిలవని పేరంటానికి వచ్చినట్టుగా అరకొరగా రాజకీయ నేతలను వచ్చినా వారిని ఘెరావ్ చేస్తూ.. ఏకంగా వేదికలపై నుంచి కిందికి దించేస్తున్నారు. మరి ప్రజల మాట వేదమా.. నాయకుల మాట న్యాయమా అనేది పైవాడికే ఎరుక.

Share this Story:

Follow Webdunia telugu