రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై యేడాది సుమారు 11 నెలల పాటు అధ్యయనం చేసి జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ తయారు చేసిన నివేదికను ఆ కమిటీ సభ్యులు గురువారం కేంద్రానికి సమర్పించనున్నారు. అయితే, ఈ కమిటీలో జస్టీస్ శ్రీకృష్ణ సూచించిన, పేర్కొన్న విషయాలు మాత్రం ఇప్పట్లో వెలుగు చూసే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు.
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే.. బంగారు బాతుగుడ్డులాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పట్టును చేజారిపోకుండా చూసుకోవడమే ప్రధాన లక్ష్యం. ఈ కమిటీ ఏదోఒకవైపుకు మొగ్గు చూపక తప్పదు. దీనివల్ల ఒక ప్రాంతంలో పార్టీ లభాపడి, మరోప్రాంతంలో పూర్తిగా నష్టపోవడం ఖాయం. పైపెచ్చు తెలంగాణ సమస్య అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం. దీనిపై జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫార్సులు, సూచనలపై కేంద్ర మంత్రిమండలిలో చర్చించిన పిదమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మొదటికే మోసం రావచ్చు. అందువల్ల కమిటీలోని అంశాలను బహిర్గతం చేసేందుకు ముందుగా భాగస్వామ్య పక్షాలకు నచ్చజెప్పాల్సి ఉంటుంది.
ఒకవేళ తుది నిర్ణయం తీసుకునేందుకు కాలయాపన చేయాలని భావిస్తే మాత్రం కమిటీ సమర్పించిన నివేదికపై అధ్యయనం చేసేందుకు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ అంశంపై ఇప్పటికే కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన యూపీఏ మంత్రుల సంఘం ఒకటి ఉంది. నివేదిక జాప్యం చేయడానికి మరోసారి అదే విధానాన్ని అవలంబించేకంటే, కొత్త ప్రక్రియను ఎదైనా తెరపైకి తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చేసే సిఫారసులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా తొలుత కేంద్ర మంత్రివర్గంలో చర్చించాల్సి ఉంటుంది. ఇదేగనుక జరిగితే, నివేదిక అంశాలు ఇప్పట్లో అధికారికంగా వెలుగుచూసే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. కమిటీ సిఫార్సులపై జనవరి నెలాఖరులోగా నిర్ణయం ప్రకటించకుంటే, తెలంగాణను భగ్గుమనిపించేందుకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఇతర తెలంగాణ ఉద్యమ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రంలోని యూపీఏ సర్కారు ఫిబ్రవరి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా వ్యూహాన్ని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు 60 ఏళ్ల సమస్యకు తాము శాశ్వత పరిష్కారం సూచిస్తామని చెపుతున్న జస్టీస్ శ్రీకృష్ణ మాత్రం.. కమిటీలో పేర్కొన్న అంశాలను మాత్రం బహిర్గతం చేసేందుకు నిరాకరిస్తూ అందరినీ ఉత్కంఠకు గురి చేస్తున్నారు. అయితే, కమిటీ సిఫార్సులు రాష్ట్రంలోని ఎక్కువ మందికి సంతృప్తి కలిగించే విధంగా ఉంటాయని జస్టిస్ శ్రీకృష్ణ చెప్పడం చూస్తే.. మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారు గనుక, కమిటీ నివేదిక కూడా వీరి మనోభావాలకు అనుగుణంగానే ఉండవచ్చనే భావన కలిగిస్తోంది. ఏది ఏమైనా.. కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలను బహిర్గతం చేస్తారో లేక కాలయాపన పేరుతో మరుగునపడేస్తారో వేచి చూడాల్సిందే.