Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవి రైతు పరామర్శ యాత్రలా..? అధికారం కోసం జిమ్మిక్కులా..?

అవి రైతు పరామర్శ యాత్రలా..? అధికారం కోసం జిమ్మిక్కులా..?
గతంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి. రైతులను కడగళ్ల పాల్జేశాయి. భారీ వరదలు పంటలను ఊడ్చుకెళ్లాయి. ఈ వరదల్లో ఊళ్లకు ఊళ్లు జలదిగ్బంధనంలో చిక్కుకుపోయాయి. ఆ సందర్భాల్లో నేతలు కేవలం పత్రికాముఖంగా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడమో... లేదంటే స్థానిక నాయకులు మొక్కుబడిగా రైతుల వద్దకెళ్లి పరామర్శించడమో జరిగింది.

కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా విరుద్ధం. ప్రతి రాజకీయ పార్టీ, రైతులు కడగళ్లు పాలయ్యారంటూ గగ్గోలు పెడుతోంది. ముఖ్యంగా ఈ పోటీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి బయటపడ్డ వైఎస్ జగన్ మధ్య తీవ్రంగా ఉంది.

రైతుల కోసం అసెంబ్లీ లాబీల్లో బాబు అండ్ టీమ్ జాగారం చేస్తే, వైఎస్.జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని సీతమ్మవారి పాదాల సాక్షిగా దీక్షకు దిగనున్నారు. రైతులకు సాయం చేయని మొండి ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం అని బాబు విమర్శిస్తుంటే.. ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందంటూ వైఎస్ జగన్ శాపనార్థాలు పెడుతున్నారు.

మరోవైపు బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సభలో వైఎస్ జగన్‌కు మద్దతిచ్చేందుకు తరలివచ్చిన నేతలు, ఇతర ద్వితీయశ్రేణి నాయకులు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పెద్దపెట్టున నినాదలతో హోరెత్తించారు. ఆ తర్వాత ప్రజలనుద్దేశించి ప్రసంగించిన జగన్, ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ విరుచుక పడ్డారు.

ఏదేమైనా ప్రస్తుతం రైతుల పరామర్శ పేరుతో రాజకీయ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయడం అధికారం కోసమేనని ప్రజలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu