Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరీంనగర్ లో సోనియా గాంధీ సారీ చెప్పి మాట్లాడాలి... కెటిఆర్

కరీంనగర్ లో సోనియా గాంధీ సారీ చెప్పి మాట్లాడాలి... కెటిఆర్
, బుధవారం, 16 ఏప్రియల్ 2014 (15:59 IST)
FILE
రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర వదులుకుని మరీ తెలంగాణ ఇచ్చాం కనుక తెలంగాణ ప్రజలు తమ ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వేయాలని కరీంనగర్ లో సోనియాగాంధీ చెపుతారేమో తెలియదు కానీ ఆ పార్టీపై టీఆర్ఎస్ మాటల దాడి మొదలుపెట్టింది. తెలంగాణ ఇచ్చిన ఘనత తమదేనని చెప్పుకుంటున్న సోనియా గాంధీ అంతకంటే ముందుగా 1200 మంది బలిదానాలకు కారణమైనందుకు సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సారీ చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.

ఇంకా కేంద్ర మంత్రి జైరాం రమేష్‌పై కూడా మండిపడ్డారు. ఆయనొక మందబుద్ధి గత నేత అని విమర్శించారు. ఆయన వల్లే తెలంగాణకు దక్కాల్సినవి దక్కకుండా పోయాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని ఈ సందర్బంగా కేటీఆర్ డిమాండ్ చేశారు.

ప్రాణహిత - చేవెళ్లకు కూడా జాతీయ హోదా కల్పిస్తామని సోనియా చేత టీకాంగ్రెస్ నేతలు చెప్పించగలరా అంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏడు ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు.

అంతేకాకుండా, దేశంలో కాంగ్రెస్ ఘోర పరాభావం ఎదుర్కోబోతుందని ఆయన జోస్యం చెప్పారు. 'కాంగ్రెస్‌కు ఓటేస్తే మురిగిపోవడం ఖాయం. కాంగ్రెస్‌కు దేశ వ్యాప్తంగా 70 సీట్లు కూడా రావు. పొన్నాల లక్ష్మయ్య ఉద్యమ ద్రోహి. తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడు అమెరికాలో పడుకున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.

పొన్నాల నోరు పారేసుకోవడం మానుకోవాలన్నారు. పొన్నాలా.. మీకు చేతనైతే మేం అడిగిన ప్రశ్నలకు సోనియాతో సమాధానం చెప్పిస్తావా? పోలవరంతో పాటు ప్రాణహిత - చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి. పోలవరం డిజైన్ మార్చేలా సోనియాతో చెప్పించాలి. పోలవరం ముంపు మండలాలు తెలంగాణలో ఉండేలా సోనియాతో చెప్పించాలి. ప్రత్యేక ఆర్డినెన్స్ రద్దు చేయించాలి. ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రకు పోవాలని సోనియాతో చెప్పిస్తావా. ఉద్యోగులకు ఆప్షన్లు లేవని సోనియాతో చెప్పించండి మేము కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తాం అని కేటీఆర్ అన్నారు.

నష్టపోయిన తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో దోపిడీకి గురైంది. సోనియాకు తెలంగాణపై సోయి తెచ్చింది టీఆర్‌ఎస్ కదా. కాంగ్రెస్ నయవంచన వల్లే తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయి. ఎంతో మంది ఆత్మహత్యల తర్వాతే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ నేతల పేర్లు సూసైడ్ నోట్‌లో రాసి చనిపోయారని ఆయన గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu