Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిరణ్ కుమార్ స్పష్టీకరణ : విభజిస్తే కాంగ్రెస్ భూస్థాపితమే!

కిరణ్ కుమార్ స్పష్టీకరణ : విభజిస్తే కాంగ్రెస్ భూస్థాపితమే!
, బుధవారం, 21 ఆగస్టు 2013 (10:16 IST)
File
FILE
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోమారు సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించారు. రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం తథ్యమని ఆయన కుండబద్ధలుకొట్టారు. కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మల్లో ఒకటిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్‌లో తమిళనాడు తరహాలో మారుతుందని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని హెచ్చరించారు. కాదని... ముందుకు అడుగు వేస్తే ఎదురయ్యే పరిణామాలను మీరే ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌కు తేల్చి చెప్పారు. దీంతో దిక్కుతోచని కాంగ్రెస్ పెద్దలు.. బిక్కమొహాలు పెట్టి.. సీఎం మాటలను వినడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తోంది.

సీమాంధ్ర ప్రజా ప్రతినిధులతో కలిసి ఏకే ఆంటోనీ కమిటీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఆయన సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించినట్టు సమాచారం. 'విభజన ఎవరికోసం? ఎవరి మేలు కోసం? దేశం కోసమా? రాష్ట్రం కోసమా? పోనీ... కనీసం పార్టీ ప్రయోజనాల కోసమా?' అని కమిటీ సభ్యులను సీఎం, ఇతర సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు నిలదీసినంత పని చేశారు.

సాగునీరు, విద్యుత్తు, హైదరాబాద్ తదితర అంశాలన్నీ ప్రస్తావిస్తూ... 'విభజిస్తే మరెన్నో సమస్యలు తలెత్తుతాయి' అని హెచ్చరించారు. నీటి యుద్ధాల గురించి ప్రస్తావించారు. హైదరాబాద్‌తో ముడిపడిన అభివృద్ధి గురించి వివరించారు. 'సమైక్యాంధ్ర తప్ప మరే ప్రతిపాదనా మాకు ఆమోదయోగ్యం కాదు' అని ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. ఇదే వాదనను కిరణ్ కుమార్ రెడ్డి కూడా బలంగా వినిపించారు.

హైకమాండ్ తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని, సమస్యలను పరిష్కరించకుండా విభజనపై ముందుకు వెళ్లవద్దని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లాంటి మరో నగరాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్నో ఏళ్లు పడుతుందని తెలిపారు. అయితే సమస్యలన్నింటనీ తాము ఇప్పటికే గుర్తించామని, అన్నింటికీ పరిష్కారాలు ఉన్నాయని ఆంటోనీ కమిటీ చెపుతూనే.. 'మీ వైపు నుంచి పరిష్కారాలు ఏవైనా ఉంటే సూచించండి' అని అది సలహా ఇచ్చింది.

అయితే, ఇలాంటి అభిప్రాయ సేకరణలతో ఉపయోగం లేదని, పరిష్కార మార్గాలపై చర్చిస్తేనే ఫలితం ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పడంతో వారు బిక్క మొహాలు వేసినట్టు సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu