Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబు ఒక్కరే నీతిమంతుడనుకుంటే ఎలా.!: బొత్స

చంద్రబాబు ఒక్కరే నీతిమంతుడనుకుంటే ఎలా.!: బొత్స
FILE
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక్కరే నీతిమంతుడనుకుంటున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి వైఖరితోనే తెలంగాణ అంశం మరింత జాప్యం అవుతోందని బొత్స ఆరోపించారు. కేసులను ఎదుర్కోలేకనే చంద్రబాబు స్టే తెచ్చుకున్నారని బొత్స ఎద్దేవా చేశారు.

రైతు సమస్యలపై చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదని బొత్స ప్రశ్నించారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వర్గ ఎమ్మెల్యేలపై త్వరలోనే వేటు వేస్తామని, గెలుపోటములకు జగన్ వర్గం ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధం లేదని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు.

ఉప ఎన్నికల్లో గెలుపు ఓటమిలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని బొత్స చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలనే.. ఉపఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా ప్రయోగిస్తామని బొత్స తెలిపారు.

శుక్రవారం బొత్స ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వ పనితీరు, అభివృద్ధిపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులా నబీ ఆజాద్కు వివరించినట్లు బొత్స తెలిపారు. ఉప ఎన్నికల అభ్యర్థులకు బీఫారాలు శనివారం అందచేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా కలసికట్టుగా ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తారన్నారు.

తెలంగాణతో సహా ఇతర సమస్యలకు కాంగ్రెస్ మాత్రమే శాశ్వత పరిష్కారం చూపగలదన్న నినాదంతో ప్రజల్లోకి వెళతామని బొత్స అన్నారు. కాంగ్రెస్కు వ్యక్తులు ముఖ్యం కాదని, సిద్ధాంతాలే ముఖ్యమన్నారు. తెలంగాణ అంశంపై తెదేపా గంటకో మాట చెప్తోందని బొత్స వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu