కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికైనా స్పందించి ఎంపీలను ఢిల్లీకి పిలిపించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి అన్నారు. ముఖ్యంగా పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులకు తెరదించి అధిష్టానం తప్పులను సరిచేసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి తనకు అభ్యంతరమేమీ లేదని ఆయన చెప్పారు.
గురువారం సమావేశంలో పార్టీ పరిస్థితిని కూలంకషంగా తను వివరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో తను లేనట్లు అనుకోవడం పొరపాటని అన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో తాము ఎన్నిక కాబడ్డామనీ, ఆయన కుమారునిగా వైఎస్ జగన్‌కు తాము మద్దతు పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే, దానికి కారణాలేమిటో పార్టీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.