ఉప ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం!?
, గురువారం, 20 జనవరి 2011 (15:34 IST)
హైకమాండ్ కంటిలో నలుసుగా మారిన కడప మాజీ ఎంపీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మట్టికరిపించే దిశగా కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో కడప డీసీసీ అధ్యక్ష పదవిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరొందిన అశోక్ కుమార్‌కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అశోక్ కుమార్ వైఎస్సార్‌కు వీర విధేయుడు మాత్రమే కాకుండా ముఖ్య అనుచరుడు కూడా. దీంతో అశోక్‌ను జిల్లా మంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, వైఎస్.వివేకానందరెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రత్యేకంగా జగన్‌ను ఎదుర్కొనేందుకు అశోక్‌కుమార్‌ను అధ్యక్షుడిగా నియమించినట్లు సమాచారం. దీనిద్వారా వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత జిల్లాలో చెక్ పెట్టడంతో పాటు శాసనసభ ఉప ఎన్నికలను ఆ జిల్లా ఫలితాలే పార్టీ భవిష్యత్తుగా కాంగ్రెస్ పరిగణిస్తోంది. ఇప్పటికే సాక్ష్యాత్తూ వైఎస్ సోదరుడు వివేకానంద కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఇప్పుడు జిల్లాలో అత్యంత పట్టు ఉన్న, వైఎస్ విధేయుడిగా పేరు ఉన్న అశోక్ కుమార్‌ను పదవిని అప్పగించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఉప ఎన్నికల పోరులో వై.ఎస్.జగన్‌కు కాంగ్రెస్ చెక్ పెడుతుందో? లేదా యువనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డే చెక్ పెడతాడో వేచి చూడాల్సిందే.