కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంపై గుంటూరు ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ కంచుకోటల జాబితా నుంచి ఆంధ్రప్రదేశ్‌ను మరచిపోవచ్చన్నారు. బహుశా.. అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్ అవసరం లేదనుకుంటాను. లేదంటే ఇంత అన్యాయం చేసేవారు కాదు, చిన్న రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి.. మనలను ఎందుకు విస్మరిస్తారు అని మండిపడ్డారు.
బుధవారం చేపట్టిన యూపీఏ మంత్రివర్గ విస్తరణలో రాష్ట్రానికి రిక్తహస్తాలు చూపించిన విషయం తెల్సిందే. దీనిపై కావూరి సాంబశివరావు తీవ్రంగా మండిపడ్డారు. అసలు రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలంటే ఢిల్లీలో విలువ లేకుండా పోయిందని వాపోయారు. వాస్తవానికి పదవులు పొందడం మా హక్కు. సోనియాగాంధీ దగ్గరికెళ్లి మేమెందుకు వెళ్లి దేబిరించాలి? అని ఆవేశంగా ప్రశ్నించారు.
గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో జరిగే సీమాంధ్ర ప్రాంత ఎంపీల సమావేశానికి కూడా వెళ్లడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ ఎంపీలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారని, వారికి కూడా రాష్ట్రం ఇచ్చేయవచ్చు కదా అని అడిగారు. దీనిపై తమను ఎందుకు సంప్రదించడం అని రాయపాటి ఘాటుగా విమర్శించారు.