ప్రస్తుత మారుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలే సమైక్యరాగానికి జైకొట్ట వచ్చుననే సందేహం కలుగుతుందని తెలంగాణ ప్రాంత నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారన్నారని ఆరోపించారు.
ఇందుకోసం ఆయన కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తెదేపా నేతలు మెత్తబడటానికి కూడా ఇదే కారణమై ఉండవచ్చన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలే సమైక్యరాగం అందుకునేలా ఉన్నారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఎవరు ఎలా మారినా తాము మాత్రం లక్ష్యాన్ని చేరుకునేంత వరకు వెనుదిరిగే ప్రసక్తే లేదన్నారు.
అంతేకాకుండా, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు సంపూర్ణ మెజారిటీ లేదన్నారు. యువనేత జగన్‌కు బాహాటంగా 24 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. అందువల్ల కేకేఆర్ సర్కారు మైనారిటీలో ఉందన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. కేకేఆర్‌తో చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకోవడం వల్లే ఈ అంశంపై ఆయన వెనుకంజ వేస్తున్నారన్నారు. అంతేకాకుండా, వారిద్దరు కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే కుట్ర పన్నుతున్నారని హరీష్ రావు ఆరోపించారు.