తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులందరూ సీమాంధ్ర నేతల మాయలో ఉన్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆయన సోమవారం పాలమూరులో జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ మన నాయకులు ఆంధ్రా నాయకులతో ములాఖత్‌కు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. మన నాయకుల మధ్య అనైక్యత కారణంగా రాష్ట్ర ఏర్పాటు ఆలస్యమవుతుందన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
సంక్రాంతి పండుగ తెలంగాణకు కీడు పండుగ అని, అదే సంక్రాంతి పండుగ ఆంధ్రా వారికి మంచి పండుగగా గుర్తు చేశారు. సంక్రాంతి వరకు తెలంగాణకు కీడు దినాలు కాబట్టి ఉద్యమాన్ని అప్పటి వరకు తీవ్రతరం చేయబోమన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ధర్నాలు, రాస్తారోకోలు పెద్ద ఎత్తున చేస్తామన్నారు.